ప్రధాన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి. ఇక దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఆయనపైన ఉంటుంది. ఇక అదే సమయంలో అత్యధిక ఆదాయం వచ్చే మార్గాలను వినియోగించుకుని... ఆ ఆదాయాన్ని ఇతర ప్రాంతాల్లో అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం దేశ ప్రధాని నరేంద్ర మోదీ పని తీరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా తయారైంది. ఇందుకు ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ప్రత్యక్ష ఉదాహరణ. దేశంలో దక్షిణ భారతదేశంలో పాగా వేయాలనేది భారతీయ జనతా పార్టీ కల. ఇప్పటికే ఉత్తర భారతంలో చాలా ప్రాంతానికి కాషాయ రంగు పులిమేశారు. కానీ దక్షిణాన మాత్రం... కర్ణాటకలో మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆ అవకాశం ఇవ్వలేదు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విడివిడిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అయితే బీజేపీ ఘోర పరాజయం పాలైంది. నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 407 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన కమలం పార్టీ... కేవలం 5 చోట్ల మాత్రమే గెలిచింది.

దీంతో దక్షిణ భారతదేశ ప్రజలపై మోదీ సారుకు కోపం వచ్చినట్లు ఉంది. ప్రాజెక్టుల కేటాయింపులో కానీ... నిధుల కేటాయింపులో కానీ వివక్ష చూపుతూనే ఉన్నారు. ప్రధానంగా రైల్వే లైన్ల విస్తరణ, కొత్త రైళ్ల కేటాయింపు అంశం వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం రైళ్ల వేగాన్ని 180 కిలోమీటర్ల వేగానికి పెంచేసింది భారతీయ రైల్వే. ఇందుకోసం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ప్రత్యేక రైళ్లు కూడా నిర్మించింది. వీటిని ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నడుపుతోంది. అలాగే రద్దీ ఉన్న మార్గాల్లో ఈ రైళ్లు నడపడం వల్ల ప్రయాణ సమయం తగ్గుతుందని కూడా అట్టహాసంగా ప్రకటించింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే నుంచి 3 ప్రధాన మార్గాల్లో రైళ్లు నడిపేందుకు ప్రతిపాదనలు పంపారు అధికారులు, సికింద్రాబాద్ - విజయవాడ- సికింద్రాబాద్, చెన్నై - విజయవాడ - చెన్నై, విజయవాడ - విశాఖపట్నం - విజయవాడ మార్గాల్లో వందే భారత్ రైళ్లు నడపాలని అధికారులు సూచించారు. సమయం ఆదాతో పాటు ఆదాయం కూడా గణనీయంగా వస్తుందని సూచించారు. కానీ కేంద్రం మాత్రం... ఇప్పటి వరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. పైగా ఉత్తర భారతానికే మరిన్ని రైళ్లు కేటాయించేలా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: