హైదరాబాద్‌ పరిధిలో భూములు కొనాలనుకుంటున్నారా.. ఏదో ఒక స్థిరాస్తి హైదరాబాద్‌లో ఉండాలని ప్లాన్‌ చేసుకుంటున్నారా.. హైదరాబాద్‌లో స్థలమో, ఫ్లాటో, వ్యవసాయ భూమో కొనాలనుకుంటున్నారా.. వీటిలో ఏం చేసినా.. ఈ వారంలోనే చేయడం మంచిది.. ఎందుకంటే.. హైదరాబాద్‌లో రియల్‌ఎస్టేట్‌ వెంచర్ల ధరలు భారీగా పెరగబోతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ భూముల విలువను అమాంతం పెంచబోతోందని సమాచారం. ప్రస్తుతం ఉన్న భూముల విలువను కనీసం సగం వరకూ పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


రాష్ట్రంలోనే వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల కొత్త మార్కెట్‌ విలువలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ నిర్ధారణ ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త మార్కెట్‌ విలువల ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విలువ మదింపు కోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి, సీనియర్‌ అధికారులు, జిల్లా రిజిస్ట్రార్ల్లు సుదీర్ఘ కసరత్తు చేశారు. మొత్తానికి ఏ ప్రాంతంలో ఎంత పెంచాలి అనే విషయంలో ఓ క్లారిటీకీ వచ్చినట్టు తెలుస్తోంది.


ఇక ఈ పెంపు హైదరాబాద్ పరిధిలో 40 నుంచి 50 శాతం వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి ఖాళీ భూములు, వ్యవసాయ భూముల విలువ ఏకంగా 50 శాతం వరకూ పెంచే అవకాశం కనిపిస్తోంది. అలాగే అపార్ట్‌మెంట్ల ఫ్లాట్లు విలువ 25 నుంచి 40 శాతం పెరిగినట్లు సమాచారం.  హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో భూముల విలువలు బాగా పెరగబోతున్నాయి. ప్రత్యేకించి వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, అపార్ట్‌మెంట్ల ఫ్లాట్ల ధరలు  40 నుంచి 50 శాతం వరకూ పెరిగినట్టు తెలుస్తోంది.


హైదరాబాద్‌ మాత్రమే కాదు.. సంగారెడ్డి, భువనగిరి, షాద్‌నగర్‌ తో పాటు రియల్ ఎస్టేట్‌ హవా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ధరలు బాగా పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌ లతో పాటు మంచిర్యాల, నల్గొండ, మిర్యాలగూడ, మహబూబ్‌నగర్‌, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లోనూ రేట్లు బాగానే పెరిగేలా ఉన్నాయి. అందుకే.. ఏది కొన్నా ఈ వారంలో పూర్తి చేస్తే భారం కొంత తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: