భారత్ లో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయనే వార్తలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఆమధ్య ఫోర్త్ వేవ్ అన్నారు కానీ, కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. తాజాగా ముంబైలో కేసులు పెరగడంతో మరోసారి కరోనా వార్తల్లో నిలిచింది. దీంతోపాటు ఇప్పుడు నియమ నిబంధనలు కూడా కఠినతరం చేస్తూ కోర్టులు ఆదేశాలిస్తున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాల్లో, విమానాల్లో మాస్క్‌ నిబంధనను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

విమానాశ్రయాల్లో ప్రయాణికులు, ప్రయాణికులతోపాటు వచ్చేవారు మాస్క్ ధరించకపోతే, అలాంటి వారికి భారీగా జరిమానా విధించాలని సూచించింది. భారత్ లో కొవిడ్ ముప్పు పూర్తి తొలగిపోలేదని, ఈ నేపథ్యంలో నిబంధనలు కఠినంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. విమాన ప్రయాణ  నిబంధనల ఉల్లంఘనకు పాల్పడే వారిని అక్కడినుంచి పంపించే ఏర్పాట్లు చేయాలని కూడా చెప్పింది. మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా ఉంటూ, సరైన పరిశుభ్రతా నియమాలు పాటించకుండా నిబంధనలు ఉల్లంఘించే ప్రయాణికులు, ఇతరులపై చర్యలు తీసుకోవాలని డీజీసీఏను కూడా ఆదేశించింది. ఈమేరకు విమానాశ్రయాలు, విమానాల్లో పనిచేసే సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేయాలని కోరింది ఢిల్లీ హైకోర్టు.

మాస్క్ లేకపోతే జరిమానా విధించాలి. అవసరమైతే వారిని విమానం నుంచి దించివేయాలని కూడా సూచించింది. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తూ తోటి ప్రయాణికుల అసౌకర్యానికి గురయితే మాత్రం వారి పేర్లను నో ఫ్లై జాబితాలో ఉంచాలని కూడా కోర్టు సిఫారసు చేసింది. విమానాశ్రయాలు, విమానాల్లో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ ఇటీవల పలు పిటిషన్లు ఢిల్లీ హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్‌ లపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈమేరకు వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ ప్రభుత్వానికి సూచనలు చేసింది. విమానాశ్రయాల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలంటూ.. ఆమేరకు డీజీసీఏ మార్గదర్శకాలు రూపొందించాలని కోర్టు ఆదేశించింది. కేవలం భోజన విరామ సమయంలో మాత్రమే మాస్క్ తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని, మిగతా సమయాల్లో మాస్క్ తప్పనిసరి అని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: