బాలీవుడ్‌లో అప్పుడప్పుడూ ఎవరైనా స్టార్‌లు లేదా నటులు వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ వ్యవహారం మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ మూవీలో హీరోగా నటించి పేరు తెచ్చుకున్న విశాల్‌ బ్రహ్మ.. ఇప్పుడు డ్రగ్స్‌ కేసులో అడ్డంగా పట్టుబడ్డాడు. ఏకంగా రూ.40 కోట్ల విలువైన 3.5 కిలోల కొకైన్‌తో చెన్నై విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా అతడి పేరు ట్రెండింగ్‌లోకి మారింది. వివరాల్లోకి వెళ్తే.. సింగపూర్‌ నుంచి చెన్నైకి చేరుకున్న విశాల్‌ బ్రహ్మ లగేజీని కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ప్లాస్టిక్‌ సంచుల్లో నిండిన తెల్లటి పొడి బయటపడింది. టెస్టులు నిర్వహించగా అవి కొకైన్‌గా తేలింది. డైరెక్టరేట్‌ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ఇప్పటికే సమాచారం ఆధారంగా అలర్ట్‌ అవ్వడంతో ఈ ఆపరేషన్‌ విజయవంతమైంది. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.

ఈ మొత్తం వ్యవహారం వెనుక నైజీరియన్‌ గ్యాంగ్‌ హస్తం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన విశాల్‌ బ్రహ్మను డబ్బు ప్రలోభాలకు గురిచేసి డ్రగ్స్‌ రవాణాకు ఉపయోగించారని సమాచారం. నైజీరియా ముఠా అన్ని ఖర్చులు భరిస్తూ అతడిని కాంబోడియా ట్రిప్‌కు తీసుకెళ్లింది. తిరిగి భారత్‌కి వచ్చే సమయంలో సూట్‌కేస్‌ అప్పగించి, దానిని సురక్షితంగా డెలివరీ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని మాటిచ్చినట్టు తెలుస్తోంది. రెండు వారాల క్రితం ఢిల్లీ నుంచి కాంబోడియా వెళ్లిన విశాల్‌, అక్కడి నుంచి సింగపూర్‌ మీదుగా చెన్నైకి చేరుకున్నాడు. ఆపై రైలు ద్వారా ఢిల్లీ చేరుకోవాల్సిన ప్లాన్‌ రూపొందించారు. కానీ అనూహ్యంగా చెన్నై విమానాశ్రయంలోనే అధికారులు రంగంలోకి దిగి ఆ ముఠా స్కెచ్‌ను చెడగొట్టేశారు.

విశాల్‌ బ్రహ్మ ఒకప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. ప్రస్తుతం అతనికి సినిమాల ఆఫర్లు అంతగా లేవు. కెరీర్‌ క్షీణించడంతో ఆర్థిక ఇబ్బందులు పెరగటం, చివరికి ఇలాంటి ప్రమాదకర మార్గాల్లో అడుగుపెట్టటానికి కారణమయ్యిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటన బాలీవుడ్‌పై మరోసారి చెడ్డపేరు తెచ్చిపెట్టింది. ఇప్పటికే పలువురు నటులు, క్రికెటర్లు డ్రగ్స్‌ వ్యవహారాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విశాల్‌ బ్రహ్మ అరెస్ట్‌తో ఆ జాబితాలో ఇంకో పేరు చేరింది. అధికారులు మాత్రం దీనిని పెద్ద సిండికేట్‌గా భావించి.. మరిన్ని అనుబంధ నెట్వర్క్‌లను బట్టబయలు చేయడానికి దర్యాప్తును ముమ్మరం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: