డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గురించి ఇటీవల హాట్ డిస్కషన్ నడిచింది. అల్లర్లు, తదనంతర పరిణామాలు, చివరకు కేబినెట్ భేటీలో పేరు మార్పు.. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు కోనసీమ జిల్లా పరిస్థితి ఏంటి..? పేరు మార్చుకున్న జిల్లాకు ఫేట్ కూడా మారుతుందా..? ఇంకెక్కడి అభివృద్ధి.. ఆ పదం వినబడాలంటే మరో పదేళ్లు ఆగాల్సిందేనని, మొన్న జరిగిన అల్లర్లతో కోనసీమ అభివృద్ధి పదేళ్లు వెనక్కి వెళ్లిపోయిందని అంటున్నారు మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్. పేరు మార్పు వ్యవహారంలో జరిగిన అల్లర్లు, తమ ఇళ్లపై జరిగిన దాడి గురించి వారు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అమలాపురం వైసీపీ ప్లీనరీ సమావేశం దీనికి వేదిక అయింది.

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ.. జరిగిన అల్లర్ల సమయంతో తమ ఇళ్లను తగలబెట్టడంపై మంత్రి పినిపే విశ్వరూప్‌, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ కుమార్‌లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. వైసీపీ అమలాపురం ప్లీనరిలో నేతలిద్దరూ ప్రసంగిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. తనను, తన భార్యను ఇంట్లో పెట్టి తగలబెట్టాలని చూశారని, ఆ సంఘటన గుర్తు చేసుకుంటే.. ఇప్పటికీ తనకు భయమేస్తోందని, తాను రాజకీయాల్లో కొనసాగడం సరికాదని అనిపించిందని చెప్పారు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్. ఇదే విషయాన్ని తాను సీఎం జగన్ కు చెప్పానని, రాజకీయాల్లో కొనసాగలేనని వివరించానని అన్నారు. కానీ సీఎం జగన్ ధైర్యం చెప్పిన తర్వాత తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానని అన్నారు. తన ఇంటితోపాటు, మంత్రి విశ్వరూప్‌ ఇంటిని సైతం తగలబెట్టారనిను, ఆయన్ను కూడా అంతం చేసేందుకు కొన్ని శక్తులు, కొందరు వ్యక్తులు కుట్ర చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే.

అల్లర్ల వల్ల తమ కంటే ఎక్కువగా జిల్లాకే నష్టం జరిగిందని, జిల్లా ప్రజలే ఇబ్బందులపాలయ్యారని చెప్పారు ఎమ్మెల్యే. కోనసీమ జిల్లాకు టూరిజం ప్రాజెక్టులు తీసుకురావాలని గతంలో తాము చాలా ప్రయత్నాలు చేశామని, కానీ మంత్రిని, ఎమ్మెల్యేను తగలబెట్టే పరిస్థితులున్న ఈ ప్రాంతానికి ఎవరైనా ప్రాజెక్ట్ లు పెట్టేందుకు ఎందుకొస్తారని ప్రశ్నించారు. కోనసీమ ప్రాంతం అభివృద్థిలో పదేళ్లు వెనక్కు వెళ్లిపోయిందని, ఇకపై ఇక్కడికి కొత్త ప్రాజెక్ట్ లు రావాలంటే వ్యాపారవేత్తలు ఆలోచిస్తారని చెప్పారు. మంత్రి విశ్వరూప్ కూడా ఈ సభలో తన ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంటిని కాల్చేయడంపై తనకు చాలా బాధ కలిగించిందని అన్నారు మంత్రి విశ్వరూప్. ఆ బధాను దిగమింగుకుని రాజకీయాల్లో కొనసాగుతున్నానని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: