తెలంగాణలో వరదల తాకిడికి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాజెక్ట్ లు పొంగి పొర్లుతున్నాయి, చెరువులు కట్టలు తెంచుకునే పరిస్థితిలో ఉన్నాయి. గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. ఇటు ఏపీలో కూడా పరిస్థితి అలాగే ఉంది. కుండపోత వానలతో కృష్ణా, గోదావరికి వరద ఉద్ధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. ఏపీలో కూడా మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిశాయి, చాలా ప్రాంతాల్లో తేలికపాటినుంచి ఓ మోస్తరు వర్షాలు పడినట్టు వాతావరణ విభాగం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి ఆనుకుని అల్పపీడనం స్థిరంగా ఉంది. ఇది మరో రెండు రోజుల్లో బలపడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

గోదావరికి వరద ప్రవాహం పెరిగింది. గత రాత్రి 10 గంటలకు ధవళేశ్వరం వద్ద 9.21 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఇది పతిలక్షల క్యూసెక్కులకు చేరుకుంది. గతేడాది సెప్టెంబరు 16న ఇక్కడ భారీ వరదలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు జులైలోనే ఆ పరిస్థితి వచ్చింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణ వైపు నుంచి వస్తున్న వరద నీటితో ప్రకాశం బ్యారేజి వద్ద ప్రవాహం అంతకంతగూ పెరుగుతోంది. దీంతో  బ్యారేజీ నుంచి నీటిని దిగువకు వదిలారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.

దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర ప్రదేశ్‌ తీరం, వాయవ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశముందని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. అంటే రాబోయే రెండు రోజులు మరింతగా వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే వరద నీరు పోటెత్తింది. ఈ వర్షాలకు మరింత నష్టం జరిగే అవకాశముంది. తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే సూచించింది. సోమవారం ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యథిక వర్షపాతం నమోదైంది. చింతూరు మండలం ఎర్రంపేటలో కూడా భారీగా వర్షపాతం నమోదైంది. అటు లంక గ్రామాల్లో కూడా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి మరింతగా పోటెత్తితే లంక గ్రామాలకు ముప్పు తప్పేలా లేదు, వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: