విడిపోయిన తెలుగురాష్ట్రాలను కలిపేయాలని డిమాండ్లు మొదలవుతున్నాయా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న డెవలప్మెంట్లు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వచ్చిన వరదల నేపధ్యంలో తెలుగురాష్ట్రాలను కలిపేయాలనే డిమాండ్ మొదలైంది. పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణాలో కొన్ని గ్రామాలు ముంపుకు గురవుతున్నట్లు తెలంగాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపణలు మొదలుపెట్టారు.






భద్రాచలం ముంపుకు గురికాకూడదంటే ఏపీకి ఇచ్చేసిన ఏడు మండలాలు, భద్రాచలంకు సమీపాన ఉన్న ఐదు గ్రామాలను మళ్ళీ తెలంగాణాలో కలిపేయాలని డిమాండ్ చేశారు. దీనికి విరుద్ధంగా ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణ మరో డిమాండ్ చేశారు. పువ్వాడ డిమాండ్ ఆధారంగా బొత్సా మాట్లాడుతు తెలుగురాష్ట్రాలను కలిపేయాలనే డిమాండ్ వినిపించారు. ఏపీలోని మండలాలు, గ్రామాలను తెలంగాణాకు తిరిగిచ్చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తే రెండు రాష్ట్రాలను కలిపేయాలని తాము డిమాండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.






తాజాగా బొత్సా వ్యాఖ్యలు వార్నింగ్ అనే కనబడినప్పటికీ నిజంగా కూడా రెండురాష్ట్రాలు కలిసిపోవాలనే కోరిక అంతర్లీనంగా చాలామందిలో ఉంది. తెలంగాణాలో సెక్రటేరియట్ ఉద్యోగులు, యూనియన్ నేతల్లో కొందరు మాట్లాడుతు అనవసరంగా ప్రత్యేక తెలంగాణా కోసం పోరాటాలు చేసినట్లు అంగీకరిస్తున్నారు. తమ పోరాటాలన్నీ వృధా అయిపోయాయని ఫీలవుతున్న కొందరు నేతలు మళ్ళీ రెండు రాష్ట్రాలు కలిసిపోతే బాగుంటుందనే కోరికను కూడా అంతర్గతంగా వినిపిస్తున్నారు.





ఇప్పటివరకు తెలంగాణాలో కొందరిలో  అంతర్లీనంగా మాత్రమే ఉన్న కోరిక ఈరోజు బొత్సా మాటల్లో బహిర్గతమైంది. సమైక్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో మాట్లాడుతు రెండుదేశాలు విడిపోయిన జర్మనీయే మళ్ళీ కలిసిపోయినపుడు రెండు రాష్ట్రాలు మళ్ళీ ఎందుకు కలవకూడదని ప్రశ్నించారు.  కాబట్టి కోరిక రూపంలో బయటపడిన డిమాండు ముందు ముందు మరింత పెద్దది కావచ్చు. కేసీయార్ పాలనను సహించలేకపోతున్న చాలామందిలో అంతర్లీనంగా మళ్ళీ సమైక్య డిమాండ్ మళ్ళీ వినిపిస్తోంది. ఈరోజు మొక్కగా ఉన్నది ఏదోరోజు మానుకాకుండానే ఉంటుందా ?

మరింత సమాచారం తెలుసుకోండి: