వరద బాధితులకు ప్రభుత్వం ఎలాంటి సాయం చేస్తుందో కానీ.. ప్రైవేటుగా కొన్ని కుల సంఘాలు, సామాజిక సేవా సంస్థలు మాత్రం వారు ఆశించిన దానికంటే ఎక్కువ సాయాన్ని అందిస్తున్నాయి. ఆపదలో అండగా నిలబడుతున్నాయి. కొన్ని చోట్ల ప్రభుత్వం కూడా చేయలేని కార్యక్రమాలను సామాజిక సేవా తత్పరులు చేసి చూపిస్తున్నారు. వరద బాధితులను సరైన సమయానికి ఆదుకుంటున్నారు.

తాజాగా ఖమ్మం జిల్లా గాండ్ల సంక్షేమ సంఘానికి చెందిన ప్రతినిధులు వరద సాయాన్ని ఆయా ప్రాంతాల్లో పంపిణీ చేశారు. సహజంగా ఎవరైనా బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు పంపిణీ చేస్తారు. కానీ వీరు మాత్రం వాటన్నిటితోపాటు.. కుక్కర్, వంట సామాన్లు కూడా పంపిణీ చేసి తమ పెద్దమనసు చాటుకున్నారు. దాదాపు 10 వస్తువులు ప్రతి కుటుంబానికి అందించారు. అందులో నిత్యావసర వస్తువులతోపాటు కుక్కర్, వంట పాత్రలు, గిన్నెలు.. ఇలా అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. వరదల్లో సర్వం కోల్పోయినా.. కొత్తగా వంటపని మొదలు పెట్టేందుకు ఇవి ఉపయోగపడతాయని చెబుతున్నారు.

వరదలతో రాజకీయాలు..
మరోవైపు వరదలల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయాలు మొదలయ్యాయి. ఓవైపు పోలవరం ఎత్తు వ్యవహారంలో కూడా వైసీపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అటు ఐదు విలీన గ్రామాల విషయంలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఎటపాక మండలానికి సంబంధించిన ఐదు విలీన గ్రామాల ప్రజలు ఆదివారం రాస్తా రోకో చేపట్టారు. తెంగాణ, ఏపీ సరిహద్దుల్లో వంటా వార్పు నిర్వహించారు. తమను తెలంగాణలో తిరిగి కలపాలని డిమాండ్ చేస్తున్నారు ఎటపాక మండల వాసులు. అయితే గ్రామస్తుల్లో కొంతమంది, ముఖ్యంగా గ్రామ ప్రజా ప్రతినిధులు.. అలాంటిదేమీ లేదంటున్నారు. తమ ఐదు గ్రామాలు ఏపీలోనే కలసి ఉంటాయని వారు నమ్మకంగా చెబుతున్నారు. గ్రామస్తులెవరూ తెలంగాణ వైపు వెళ్లాలని అనుకోవడంలేదని, ఏపీ నుంచి అందుతున్న సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెబుతున్నారు ఎటపాక ప్రాంత ప్రజా ప్రతినిధులు. అయితే ఈ వ్యవహారం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారడం విశేషం. దీనిపై రాజకీయంగా ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: