నరేంద్రమోడీతో భేటీ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్ధితి ఇలాగే అయిపోయింది. మోడీని కాదని స్వేచ్చగా ముందుకెళ్ళలేరు అలాగని బీజేపీతో మనస్పూర్తిగా కంటిన్యు అవ్వలేరు.  పవన్ పరిస్ధితి గట్టిగా లాక్ అయిపోయిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మోడీతో భేటీ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని అధికారంలో నుండి దింపటానికి అన్నీపార్టీలను కలుపుకుని వెళ్ళాలని పవన్ చెప్పారు. ముఖ్యంగా టీడీపీతో పొత్తుపెట్టుకోవాలని నొక్కి మరీ చెప్పారు.





అయితే మోడీ మాత్రం అందుకు అంగీకరించలేదట.  ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందికాబట్టి పొత్తుల విషయంపై చర్చ ఇపుడే అవసరంలేదని తేల్చేశారు. బీజేపీతో కలిసే జనసేన పోరాటాలు చేయాలని స్పష్టంగా చెప్పారు. రెండుపార్టీలు వేర్వేరుగా కార్యక్రమాలు చేయటం కాదని ఇకనుండి రెండుపార్టీల నేతలు కలిసే కార్యక్రమాలు చేయాలని చెప్పారు. పవన్ గతంలో అడిగిన రోడ్ మ్యాపును తొందరలోనే అందిస్తానని హామీఇచ్చారు. మోడీ వైఖరి చూసిన తర్వాత చంద్రబాబునాయుడుతో కలవటానికి ఏమాత్రం ఇష్టపడటంలేదని అర్ధమైపోయింది.





మరిపుడు పవన్ ఏమిచేస్తారు ? బీజేపీతోనే కలిసి పనిచేయమని చెప్పిన తర్వాత కూడా పవన్ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోగలరా ? మోడీని కాదని ధైర్యంగా మిత్రపక్షమైన బీజేపీకి కటీఫ్ చెప్పి బయటకు వెళ్ళి టీడీపీతో కలవగలరా ? అనేది పెద్ద ప్రశ్న. ఇపుడు పరిస్ధితి ఏమిటంటే  బీజేపీతో కలిసి ఉండటం పవన్ కు ఇష్టంలేదని ఇప్పటికే అర్ధమైపోయింది. ఇందుకనే బీజేపీ దగ్గర పవన్ లాక్ అయిపోయారనేది.





మోడీని కాదని బీజేపీతో తెగతెంపులు చేసుకుని వెళితే భవిష్యత్ పరిణామాలు ఎలాగుంటాయో అంచనా వేయలేని అమాయకుడు కాదు పవన్. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న పార్టీల నేతల పరిస్ధితి ఎలాగవుతున్నదో ఇతర రాష్ట్రాల్లో పవన్ చూడటంలేదా ? అసలు మోడీతో పవన్ భేటీ అయి తప్పుచేశారని అనిపిస్తోంది. చంద్రబాబుతో చేతులు కలిపిన పవన్ బీజేపీతో కటీఫ్ చెప్పేసుంటే వేరేరకంగా ఉండేది. కానీ అలాకాకుండా చంద్రబాబు చేతులు కలిపిన తర్వాత మళ్ళీ మోడీని కలవటమే పవన్ చేసిన తప్పు. మరి తప్పును ఎలా సరిదిద్దుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: