లాక్‌డౌన్‌ కారణంగా ఆర్ధిక ఇబ్బందుల  వల్ల కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రైవేట్‌ స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇంటర్‌ కాలేజీలకు కూడా ఈ ఆదేశాలు వర్తింప చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఎక్కువగా దోపిడీ జరిగేది జూనియర్‌ కాలేజీల్లోనేనని... అక్కడే నియంత్రణ ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

 

తెలంగాణ లో 2 వేల 786 రిజిస్టర్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 2 వేల 570 కళాశాలలకు ఇంటర్ బోర్డ్ అనుమతి ఉంది. ఇంటర్ అనుబంధ కళాశాలల్లో 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు... 681 సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీలు ఉండగా... 14 వందల 86 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి.  ఈ విద్యా సంస్థల్లో ప్రస్తుతం తొమ్మిదిన్నర లక్షల మంది చదువుతున్నారు. వచ్చే విద్యాసంవత్సరం కూడా దాదాపు ఇదే సంఖ్యలో స్టూడెంట్స్‌ ఉండే అవకాశం ఉంది. వీరిలో దాదాపు ఆరు లక్షల మంది ప్రైవేట్‌ కాలేజీల్లోనే చదువుతున్నారు. ఇక ఫీజులు చూస్తే లక్షల్లోనే ఉంటాయ్‌. 

 

ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజులు పెంచొద్దని.. ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. అయితే జూనియర్‌ కళాశాలలకు కూడా ఈ నియమం వర్తించేలా చూడాలని విద్యార్ధుల తల్లిదండ్రులు కోరుతున్నారు. రకరకాల పేర్లతో ఒక్కో కాలేజీ ఒక్కో రకంగా 35 వేల నుండి మూడున్నర లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

ప్రైవేట్,కార్పోరేట్ జూనియర్ కళాశాలల ఫీజులను ప్రభుత్వం నిర్ణయించాలని... ఆ మేరకే వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

 

పాఠశాలల ఫీజుల విషయంలో నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ఫీజుల విషయంలోనూ చొరవ తీసుకోవాలని కోరుతున్నారు విద్యార్ధుల తల్లిదండ్రులు. దీనిపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: