కరోనా తర్వాత ఆరోగ్యంపై ప్రజలకు శ్రద్ధ పెరిగింది. అదే సమయంలో ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని భూతద్దంలో చూడ్డం కూడా పెరిగింది. అయితే నిజంగానే సమస్యలు కూడా పెరిగాయని అంటున్నారు వైద్య నిపుణులు. వాటిని పెద్దవి చేసి చూడాల్సిన అవసరం లేకపోయినా కరోనా తర్వాత మాత్రం మానవుల ఆరోగ్య సమస్యలు అధికం అయ్యాయని అంటున్నారు. అందులో ఒకటి తలనొప్పి. ముఖ్యంగా స్కూల్ పిల్లలు కరోనా కాలం తర్వాత ఎక్కువగా తలనొప్పికి గురవుతున్నారని చెబుతున్నాయి సర్వేలు.

స్కూల్ కి వెళ్లి చదువుకునే విద్యార్థుల్లో ప్ర‌తి ముగ్గురిలో ఒక‌రు తీవ్ర త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతున్నారని తాజా సర్వవే తెలిపింది.  కొవిడ్-19 మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న స‌మ‌యంలో ఆన్‌ లైన్ పాఠాలు విన్న పిల్లల్లో ఈ ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా  బయటపడినట్టు తెలుస్తోంది. ఆన్‌ లైన్ విధానంలో పాఠాలు వినేందుకు ఇంట్లో స‌రైన ప‌రిస్థితులు లేక‌పోవ‌డం దీనికి ప్రధాన కారణంగా తేలింది. చదువు తర్వాత ప‌రీక్ష‌లు, కొవిడ్‌-19 గురించి ఆందోళ‌న‌లతో తలనొప్పి పెరిగిందని.. కొత్తగా కొంతమందికి తలనొప్పి రావడానికి ఇదే కారణం అని చెబుతున్నారు.

టర్కీలోని కరామన్‌ ఎర్మెనెక్ స్టేట్ హాస్పిటల్ లో ప్రముఖ పరిశోధకుడు ఐసే నూర్ ఓజ్‌ డాగ్ అకార్లీ ఈ పరిశోధన మొదలు పెట్టారు. 10 నుంచి 18 ఏళ్ల వయసు మధ్య ఉన్న 851 మంది పిల్లలపై ఆయన పరిశోధన కొనసాగించారు. ఈ అధ్య‌య‌న కాలంలో 756 మంది పిల్లలు త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతున్న‌ట్లు ఆయన గుర్తించారు. ఇందులో ప‌ది శాతం మంది పిల్లలు కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో కొత్త‌గా త‌ల‌నొప్పి బారిన‌ప‌డినట్టు తేల్చారు. అయితే ఇలా కొత్తగా తలనొప్పి బారిన పడిన పిల్లలకు కరోనా వచ్చిందా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయలేదు. కరోనా వచ్చినా, రాకపోయినా.. ఆ సమయంలో పిల్లలు తలనొప్పికి గురయ్యారని, అది దీర్ఘకాలిక తలనొప్పిగా మారిందని చెబుతున్నారాయన. కొత్త‌గా త‌ల‌నొప్పిబారిన‌ప‌డిన విద్యార్థులు.. నెలకు సగటున 8-9 సార్లు తలనొప్పితో బాధపడుతున్న‌ట్లు గుర్తించారు. వీరిలో మూడోవంతు మంది పిల్లలు తలనొప్పికి మందులు వేసుకున్నారు. మిగతావారంతా తల్లిదండ్రుల సపర్యలతో సాంత్వన పొందారు. పిల్లల మానసిక ఆరోగ్యం, పాఠశాల్లో పెట్టే పరీక్షలు, ఇతర క్రీడల్లో విజయాలపై తలనొప్పి పెద్ద ప్రభావాన్ని చూపుతుందని ఈ అధ్యయనం తేల్చింది. పిల్లల తలనొప్పి విషయంలో అశ్రద్ధ వద్దని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: