జగన్ సర్కారు మరో సంచలనానికి తెర తీసింది.  గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్  కొనుగోలు ఒప్పందాలపై  దృష్టి సారించింది.   వీటిలో భారీ అవినీతి జరిగిందని చెప్పిన జగన్..  పరిశీలన కోసం ఓ కేబినెట్ సబ్ కమిటీని వేశారు.

 

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు లోని దాదాపు 30 అంశాలపై విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి జగన్ తేల్చి చెప్పారు.   విద్యుత్ ఒప్పందాలు ఖరారు చేసిన అప్పటి ముఖ్యమంత్రి,  మంత్రి,  ఉన్నతాధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు.  ఒప్పందాల్లో భారీ దోపిడీ జరిగిందని  స్పష్టమైందని జగన్ అభిప్రాయపడ్డారు.

 

ఈ ఒప్పందాల ద్వారా  రెండు వేల ఆరు వందల కోట్లకు పైగా రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని విద్యుత్ శాఖ అధికారులతో జరిపిన సమీక్షలో వెల్లడైంది.  అందుకే ఈ సొమ్మును రికవరీ చేసేలా చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు.  ఒప్పందాల్లో మార్పుల కోసం కంపెనీలతో తిరిగి చర్చలు జరిపేందుకు ఓ కమిటీ ని వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

ఒకవేళ  సౌర పవన విద్యుత్ కంపెనీలు దారికి  రాని పక్షంలో... ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి కూడా  ప్రభుత్వం వెనుకాడదని జగన్ స్పష్టం చేశారు.  మొత్తం మీద విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగిన అవినీతి చంద్రబాబు మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: