వైజాగ్ ను రాజధానిగా చేయాలన్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్రమోడి పూర్తిస్ధాయి మద్దతు పలుకుతున్నట్లేనా ?  కేంద్రప్రభుత్వం నుండి మొదలైన తాజా డెవలప్మెంట్ చూసిన వాళ్ళందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే డెవలప్మెంట్ చూసిన తర్వాత చంద్రబాబునాయుడు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా గొంతులో పచ్చి వెలక్కాయపడ్డట్లయ్యింది. రాజధాని విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని కేంద్రం కుండబద్దలు కొట్టినట్లుగా వారం రోజుల క్రితమే హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఈ అఫిడవిట్ ను కూడా పచ్చబ్యాచ్ లో కొందరు వక్రీకరిస్తున్న విషయం చూస్తున్నదే. రాజధాని విషయంలో తాను జోక్యం చేసుకోనని కేంద్రం చెప్పిందే కానీ జగన్ ప్రయత్నాలను నిలిపేస్తుందంటూ దింపుడు కళ్ళెం ఆశలతో కొందరు నేతలున్నారు.




అయితే అటువంటి వాళ్ళ ఆశలన్నీ తాజా పరిణామాలతో పటాపంచలైపోయుంటాయి. ఇంతకీ కేంద్రం మద్దతు ఏ విధంగా వచ్చిందంటే జాతీయస్ధాయిలో విస్తరించాలని కేంద్రం అనుకున్న 26 జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో మూడింటిని ఏపికే కేటాయించింది. ఈ మూడు కూడా జగన్ విజ్ఞప్తి మేరకు విశాఖపట్నం కేంద్రంగా కేంద్రం మంజూరు చేయటమే విశేషం. హైదరాబాద్-భద్రాచలం-వైజాగ్ ఒకటి, విశాఖపట్నం-నాగ్ పూర్ మధ్య రెండోది, ఇక మూడో జాతీయ రహదారి వైజాగ్ టు రాయపూర్. విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకోవాలని జగన్ డిసైడ్ అయిన తర్వాత కేంద్రానికి ఓ లేఖ రాశాడు. విశాఖపట్నం కేంద్రంగా మూడు జాతీయ రహదారులను శాంక్షన్ చేయాలంటూ లేఖలో కేంద్రాన్ని కోరటం, అందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వెంటనే శాంక్షన్ చేసేయటం ఆశ్చర్యంగా ఉంది.




జగన్ లేఖకు అనుగుణంగా కేంద్రం ఇంత స్పీడుగా రెస్పాండ్ అయిన తీరుతోనే  వైజాగ్ రాజధాని ప్రతిపాదనకు కేంద్రం కూడా పూర్తిగా మద్దతు పలుకుతోందనే విషయం అర్ధమవుతోంది.  సరే హైకోర్టులో కేసుల కారణంగా శంకుస్ధాపన మహాఅయితే ఓ నాలుగు రోజులు ఆలస్యం అయితే అవ్వచ్చంతే. ఇక శంకుస్ధాపనకు ప్రధానమంత్రి వస్తాడా ? రాడా ? అన్నదే సస్పెన్సుగా మారింది. ఇప్పటికైతే ప్రచారంలో ఉన్నట్లుగా అక్బోబర్ 25వ తేదీన విజయదశమి రోజున వైజాగ్ లో సచివాలయం నిర్మాణానికి ముహూర్తం ఫిక్సయినట్లు తెలుస్తోంది. అక్టోబర్ అంటే ఇంకా చాలా రోజులున్నా ప్రధానమంత్రిని అధికారికంగా ఆహ్వనించాలంటే కన్ఫర్మేషన్ ఇప్పుడే తెలియాలి. ఆ కన్ఫర్మేషన్ కోసమే ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాని కార్యాలయానికి లేఖ కూడా రాసినట్లు సమాచారం.




తాజాగా మూడు జాతీయ రహదారులను శాంక్షన్ చేసిన కారణంగా సచివాలయం శంకుస్ధాపనకు నరేంద్రమోడి వస్తారనే ప్రభుత్వ వర్గాలు అనుకుంటున్నాయి. అయితే నేరుగా వైజాగ్ వచ్చి శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారా ? లేకపోతే ఢిల్లీ నుండి వర్చువల్ పద్దతిలో శంకుస్ధాపనలో పాల్గొంటారా అన్నదే తేలాలి. ఏదేమైనా కేంద్రం నుండి జగన్ కు మద్దతు దొరకటం నిజంగా కొండంత బలమనే చెప్పాలి. ఒకవైపు ప్రతిపక్షాలు, మరోవైపు ఎల్లోమీడియా అదే సమయంలో నరసాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు లాంటి సొంత ఎంపినే జగన్ జోరుకు బ్రేకులు వేయాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి నేపధ్యంలో కేంద్రం మాత్రం జగన్ కు మద్దతుగా నిలవటం పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. సో కోర్టుల్లోని వివాదాలను వీలైనంత తొందరగా క్లియర్ చేసుకోగలిగితే  వైజాగ్ కు జగన్ తరలి వెళ్ళే అవకాశాలొస్తాయన్నది వాస్తవం.


మరింత సమాచారం తెలుసుకోండి: