నాలుగు రోజుల క్రితం.. ఇండోనేషియాకు చెందిన శ్రీవిజయ సంస్థ బోయింగ్‌ 737-500 మోడల్‌ విమానం ప్రమాదానికి గురైంది. బయలు దేరిన కొద్దిసేపటికే జకార్తా పక్కను ఉన్న సముద్ర దీవుల్లో కూలిపోయింది. ఈ ప్రమాదానికి కారణాలు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ ప్రమాదానికి గురై స్థలం గురించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. భూమిపై ఉన్న అతిపెద్ద దీవుల సమూహం ఇండోనేషియానేనట. ఇక అత్యధిక పిడుగుపాటులు, ఉరుములు వస్తుంటాయట.

ఇందుకు చాలా ఆధారాలు చూపిస్తున్నారు. 1988లో బొగోర్‌ పట్టణంలో  322 రోజులపాటు పిడుగులు పడ్డాయట. అంతే కాదు.. ఇక్కడ అగ్నిపర్వతాలు కూడా ఉన్నాయి. అవి బద్దలైనప్పుడు ఆ బూడిద గాల్లో కొన్ని కిలోమీటర్ల మేరకు వ్యాపిస్తుంది. వీటిని జెట్‌ ఇంజిన్లు పీల్చుకొంటే ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ప్రాంతాల్లో వర్షాలు కూడా ఎక్కువగానే కురుస్తాయి. మొన్న ప్రమాదానికి గురైన శ్రీవిజయ ఫ్లైట్‌ 182  కూడా ప్రతికూల వాతావరణంతో గంటన్నర ఆలస్యంగా బయల్దేరింది. భారీగా వర్షం పడుతుండటంతో అది ప్రమాదానికి దారి తీసి ఉండొచ్చంటున్నారు.

ఇక ఇండోనేషియాకు విమాన ప్రమాదాల చరిత్ర చాలా ఉంది. ఆసియాలోనే అత్యంత చెత్త విమానయాన రికార్డు ఆ దేశం సొంతం. ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ప్రకృతి తోడు కావడంతో ప్రతి ఏటా ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకోవడం.. పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు  కోల్పోవడం సర్వసాధారణంగా మారిపోయింది.  ఇక్కడ 1945 నుంచి  104 ప్రమాదాలు జరిగాయి. మొత్తం  1300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ఆసియాలోనే ఇది అత్యంత ప్రమాదకరమైన విమానయాన రికార్డుగా చెబుతారు.  

1990లలో ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థను పెట్టుబడుల కోసం తెరిచింది. పెట్టుబడుల కోసం నియమనిబంధనలు గాలికొదిలేశారు. చాలా చోట్ల భద్రతా ఏర్పాట్లు కూడా కరవయ్యాయి. శిక్షణ లోపం, రికార్డుల నిర్వహణ లేమి, సాంకేతిక నైపుణ్యాల కొరత, తనిఖీల వ్యవస్థలో లోపాలే ఈ ప్రమాదాలకు కారణంగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: