విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా  ఏపి అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. తీర్మానం సందర్భంగా సభలో మాట్లాడిన అధికారపార్టీ నేతలంతా ప్రైవేటీకరణకు కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ మాట్లాడారు. విశాఖ స్టీల్స్ ఆంధ్రుల ఆత్మగౌరవంగా అభివర్ణించారు. ఇదే విషయమై గతంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడికి జగన్మోహన్ రెడ్డి లేఖలు  రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రైవేటీకరణకు ప్రత్యామ్నాయంగా జగన్ లేఖల్లో చేసిన సూచనలను కూడా ప్రస్తావించారు. తాజాగా అసెంబ్లీ తీర్మానాన్ని కూడా చీఫ్ సెక్రటరీ కేంద్రప్రభుత్వానికి పంపుతారు. అంతా బాగానే ఉంది కానీ లేఖలు రాస్తే, అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోతుందని జగన్ అనుకుంటున్నారా ?





ఏమో మంత్రులు, అధికారపార్టీ ఎంఎల్ఏలు మాట్లాడిన మాటలు చూస్తుంటే అలాగే అనుమానంగా ఉంది. ఎట్టి పరిస్ధితుల్లోను ఇప్పటివరకు  జగన్ చేసిన ఏ ప్రయత్నం కూడా సరిపోదన్న విషయం అందరికీ తెలిసిందే. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకోవాలంటే రాజకీయపరమైన ఒత్తిడి తేవటం ఒకటే మార్గం. లేఖలను, అసెంబ్లీ తీర్మానాన్ని మోడి లెక్క చేస్తారన్న నమ్మకం లేదు. ఎందుకంటే రాష్ట్ర విభజన సందర్భంగా చేసిన విభజన చట్టాన్ని, రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటననే మోడి ఏమాత్రం పట్టించుకోలేదు. అలాంటిది మోడిపై ఎలాంటి ఒత్తిడి తేలేని స్ధితిలో జగన్ లేఖలు రాస్తే, అసెంబ్లీ తీర్మానం చేస్తే పట్టించుకుంటారా ?





ఎట్టి పరిస్ధితుల్లోను మోడి ఇవేవీ పట్టించుకునే స్ధితిలో లేరన్నది వాస్తవం. మోడి ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి ఏపి విషయంలో అన్యాయం జరుగుతునే ఉన్నది. రాష్ట్రంలో బీజేపీ నేతలు కూడా కేంద్ర నాయకత్వంపై ఎలాంటి ఒత్తిళ్ళు తేలేని స్ధితిలో ఉన్నారు కాబట్టే కేంద్రం అన్యాయాలను చేస్తునే ఉంది. కాబట్టి విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణను ఆపాలంటే జగన్ రాజకీయంగానే మోడిపై ఒత్తిడి తేవాలి. ఢిల్లీ స్ధాయిలో మోడిపై చాలా గట్టిగా వ్యతిరేకించాలి. భేషజాలకు పోకుండా రాష్ట్రంనుండి అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్ళాలి. జాతీయపార్టీలను, లోక్ సభ, రాజ్యసభలో వివిధ పక్షాల నేతలను, ఎంపిలను కలిసి సమస్యను వివరించి మద్దతు కూడగట్టాలి. అన్నీ వైపుల నుండి జగన్ ఒత్తిడి తీసుకొస్తే కానీ మోడి దారికిరారన్నది అందరకి తెలిసిందే. మరి జగన్ అందుకు సిద్ధంగా ఉన్నారా ?


మరింత సమాచారం తెలుసుకోండి: