గ‌తంలో ప్ర‌పంచంలో అగ్ర‌దేశ‌మేదంటే ఎవ‌రికైనా వెంట‌నే గుర్తొచ్చేది అమెరికానే. ర‌ష్యా విచ్ఛిన్న‌మ‌య్యాక  అమెరికా ఆధ్వ‌ర్యంలో ఏక‌ధ్రువ ప్ర‌పంచంగా మారిపోయిన ప‌రిస్థితే కనిపించేది. బ్రిట‌న్‌, ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీ వంటి యూరోపియ‌న్ దేశాలు, ఆర్థికంగా వాటి స‌ర‌స‌న నిలుచునే ఆసియా దేశాలైన జ‌పాన్, ద‌క్షిణ కొరియా ఇవ‌న్నీ అమెరికా వెన్నంటి న‌డిచేవి. 21 వ శ‌తాబ్దం మొద‌టి రెండు ద‌శ‌కాల్లోనూ అన్ని రంగాల్లోనూ అమెరికాకు దీటుగా.. కొన్నిరంగాల్లో అంత‌కంటే మిన్న‌గా ప్ర‌బ‌ల శ‌క్తిగా ఎదిగిన చైనా జోరుకు అమెరికా స‌హా ఇత‌ర ప్ర‌పంచ దేశాల‌న్నీ బేజార‌వుతున్నాయి. ఇక చైనాకు ఇరుగుపొరుగు దేశాల‌యితే ఆ దేశం ద‌శాబ్దాలుగా అనుస‌రిస్తున్న‌ స‌లామీ స్లైసింగ్ విధానాన్ని ఏ విధంగా అడ్డుకోవాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నాయి. భార‌త్ కూడా ఈ విష‌యంలో చైనా బాధిత దేశ‌మే. ఇంత‌కీ స‌లామీ స్లైసింగ్ అంటే కొంచెం కొంచెంగా ఇత‌రుల భూభాగాల్ని ఆక్ర‌మించుకుని స‌రిహ‌ద్దులను మార్చి అక్క‌డ పాగా వేయ‌డ‌మ‌న్న‌మాట‌. ఈ కుటిల వ్యూహంలో చైనా ఆరితేరిపోయింద‌ని చెప్పాలి. ఆరు ద‌శాబ్దాల క్రితం 1962లో భార‌త్‌పై దురాక్ర‌మ‌ణ జ‌రిపిన పొరుగు దేశం సుమారు 45,000 చ‌ద‌ర‌పు కిలోమీటర్ల మ‌న భూభాగాన్ని ఆక్ర‌మించుకుని ఏక‌ప‌క్షంగా స‌రిహ‌ద్దుల‌ను మార్చేసింది. గ‌డ‌చిన కొన్నేళ్లుగా చైనా స‌ముద్రంపై పూర్తి ఆధిప‌త్యం త‌న‌దేన‌ని ప్ర‌క‌టిస్తూ అక్క‌డ నౌకా ర‌వాణాను త‌న కంట్రోల్లోకి తెచ్చుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. పొరుగున ఉన్న జ‌పాన్ కు చెందిన సెంకాకూ దీవులు త‌న‌వేన‌ని క‌వ్విస్తూ జ‌పాన్‌కు కాక పుట్టిస్తోంది. తైవాన్ దేశాన్ని పూర్తిగా చైనా ఆధిప‌త్యంలోకి తెచ్చుకునేందుకు సైనిక బ‌లాన్నిప్ర‌ద‌ర్శిస్తూ ఆ దేశానికి ర‌క్ష‌ణ‌గా ఉన్న అమెరికాను రెచ్చ‌గొడుతోంది.

          ఇక గ‌త కొంత‌కాలంగా భారత‌, చైనా దేశాల మ‌ధ్య స‌రిహ‌ద్దు త‌గాదాలు త‌ర‌చుగా జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. రానున్న రోజుల్లో ఇవి మ‌రింత ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరుకునే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఒక‌ప‌క్క చ‌ర్చ‌ల‌కు సానుకూల‌మంటూనే మ‌రోప‌క్క స‌రిహ‌ద్దుల్లో చైనా త‌న సైనిక శిబిరాల‌ను బ‌లోపేతం చేసుకుంటోంద‌ని ర‌క్ష‌ణ వ‌ర్గాలు చెపుతున్నాయి. రెండు నెల‌ల క్రితం చైనా పీపుల్స్ కాంగ్రెస్ చేసిన ఓ చ‌ట్టం ద్వారా స‌రిహ‌ద్దు వివాదాల‌ను సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకునే ఉద్దేశం ఆ దేశానికి ఏ కొశానా లేద‌ని తేట‌తెల్ల‌మైంది. వీటిలో ఎల్ఏసీ, భూటాన్ స‌రిహ‌ద్దు వంటి వివాదాస్ప‌ద అంశాలున్నాయి. భార‌త్‌లోని ల‌ద్దాఖ్‌, అరుణాచ‌ల్‌ ప్ర‌దేశ్‌ల వద్ద‌ స‌రిహ‌ద్దుల్లో భారీగా కొన్ని గ్రామాల నిర్మాణం చేప‌ట్టి ఆ ప్రాంతాలు త‌మ‌వేన‌ని చాటుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఏక‌కాలంలో అగ్రరాజ్యం అమెరికా స‌హా ప‌లు దేశాల‌కు స‌వాల్ విసురుతున్న చైనాను నిలువ‌రించేదెలాగో తెలియ‌క మిగిలిన దేశాలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: