క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌కు మ‌రోసారి దేశ‌వ్యాప్త క‌ఠిన లాక్‌డౌన్ విధించ‌డ‌మే మార్గ‌మ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నామండ‌లి, కోవిడ్ పై ఏర్పాటు చేసిన నేష‌న‌ల్ టాస్క్‌ఫోర్స్ తాజాగా కేంద్ర ప్ర‌భుత్వానికి సూచించాయి. క‌రోనా పాజిటివిటీ రేటు 10 శాతం మించిన‌ జిల్లాల్లో 6 నుంచి 8 వారాలు లాక్‌డౌన్ పెట్ట‌డం ద్వారా సంక్షోభ నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి సూచించిన‌ట్టు ఐసీఎంఆర్ చీఫ్ బ‌ల‌రాం భార్గ‌వ్ బుధ‌వారం రాయిట‌ర్స్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. అయితే గ‌త ఏడాది పంజా విసిరిన కోవిడ్ ఫ‌స్ట్‌వేవ్ స‌మ‌యంలో కేంద్రం విధించిన క‌ఠిన లాక్‌డౌన్ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను దారుణంగా దెబ్బ తీయ‌డంతోపాటు, ప్ర‌జ‌లు, ముఖ్యంగా వ‌ల‌స కార్మికులు తీవ్ర ఇక్క‌ట్లు ఎదుర్కొన్న అనుభవంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇందుకు సిద్ధంగా లేన‌ట్టు తెలుస్తోంది. అందుకే లాక్‌డౌన్ పై నిర్ణ‌యాన్నితీసుకునే బాధ్య‌త‌ను కేంద్రం.. రాష్ట్ర ప్ర‌భుత్వాల భుజంపైనే మోపింది.

ఇదిలా ఉండ‌గా ప్ర‌మాద‌క‌రంగా పెరుగుతున్న కోవిడ్ సెకండ్ వేవ్ కేసుల నియంత్ర‌ణ‌కు మొట్ట‌మొద‌టగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ రాష్ట్రాల్లో ఆ ప్ర‌భుత్వాల‌ చ‌ర్య‌లు ఫ‌లితాన్నిచ్చాయి. అక్క‌డి కేసుల పెరుగుద‌ల రేటు అదుపులోకి వ‌చ్చింది. ఇక భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నామండ‌లి( ఐసీఎంఆర్‌) వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం కోవిడ్ పాజిటివ్ దేశ‌వ్యాప్త స‌రాస‌రి రేటు ప్ర‌స్తుతం 21 శాతంగా ఉంది. 48 శాతం పాజిటివిటీ రేటుతో గోవా ఈ జాబితాలో ప్ర‌థ‌మ స్థానంలో ఉండ‌గా 37 శాతంతో హ‌ర్యాణా రెండో స్థానంలో ఉంది. పుదుచ్చేరి, కర్నాట‌క త‌రువాత స్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విష‌యానికొస్తే తెలంగాణ‌లో ఇది 9 శాతంగా ఉండ‌గా, ఏపీలో 23 శాతం న‌మోద‌వుతోంది. దీనిని బ‌ట్టి చూస్తే ఏపీ ప‌రిస్థితి కాస్త ప్ర‌మాద‌క‌రంగానే ఉంద‌ని చెప్పాలి. ఏపీలో ఏక్టివ్ కేసుల సంఖ్య కూడా 1,97,00 దాటాయి.ఇక గ‌త 24 గంట‌ల్లో ఏపీలో 21,452 కొత్త కేసులు న‌మోదు కాగా, 89 మంది చ‌నిపోయారు. తెలంగాణ‌లో మంగ‌ళ‌వారం నుంచి లాక్‌డౌన్ అమ‌లు చేస్తుండ‌గా, ఏపీలో కూడా ఇప్ప‌టికే పాక్షిక లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్న‌ విష‌యం తెలిసిందే. అయితే క‌రోనా వైర‌స్ ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తున్న నేప‌థ్యంలో..పరిస్థితి మరింత విషమించకుండా ఉండేందుకు జాతీయ టాస్క్‌ఫోర్స్ సూచ‌న‌ల మేర‌కు మ‌రోసారి దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ విధించ‌క‌ త‌ప్ప‌దేమోన‌న్న విశ్లేష‌ణ‌లు సైతం గ‌ట్టిగానే వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: