తెలంగాణ విద్యాశాఖ సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌- CBSE విధానంపై దృష్టి పెట్టింది. సీబీఎస్‌ఈ పరిధిలో విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు జరుగుతాయి. ఇదే తరహాలో రాష్ట్రంలో కూడా పదో తరగతి విద్యార్థులకు ఏడాదిలో రెండు సార్లు పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ భావిస్తోంది. ఇందుకు ఆమోదం లభిస్తే ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు త్వరలో రాష్ట్ర విద్యాశాఖ సమావేశం కానుంది. ఒకవేళ ఆ భేటీలో విద్యాశాఖ ప్రతిపాదించిన దానికి ఆమోదం లభిస్తే.. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

నిజానికి క‌రోనాతో దెబ్బతిన్న విద్యా ప్రమాణాల‌ను మ‌ళ్లీ మెరుగుప‌రిచేందుకు తెలంగాణ విద్యాశాఖ నానాతంటాలు ప‌డుతోంది. ఇందులో భాగంగానే వ‌చ్చే ఏడాది ప‌రీక్షల విధానానికి ఎన్నోమార్పులు చేర్పులు చేసేందుకు ఇప్పటినుంచి క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ ఏడాది ముంచుకొచ్చిన క‌రోనా రెండో ద‌శ ముప్పుతో ప‌రీక్షలు లేకుండానే విద్యార్థుల‌ను పాస్ చేయాల్సి వ‌చ్చింది. గ‌డిచిన రెండేళ్లుగా ఇలానే కొనసాగుతూ వ‌స్తోంది. అయితే భ‌విష్యత్ ఎలా ఉంటుందో ఎవ‌రు చెప్పలేని ప‌రిస్థితి. దీంతో ప‌రిస్థితులు అనువుగా ఉన్న సమ‌యంలోనే మిడ్ ప‌రీక్షలు పెడితే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న విద్యాశాఖ చేస్తోంది. ఈ ఏడాది నుంచే ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల విధానంతో కొత్త మార్పులు తీసుకురాబోతున్నారు.

మాములుగా అయితే ఇంట‌ర్నల్‌ ప‌రీక్షలు పాఠ‌శాల‌ల స్థాయిలోనే జ‌రిగినా.. బోర్డు స్థాయిలో మాత్రం ఏడాదికి ఏప్రిల్‌లోనే ఫైన‌ల్ పరీక్షలు నిర్వహించ‌డం ఆన‌వాయితీ. అయితే అలాంటి బోర్డు ప‌రీక్షలు న‌వంబ‌ర్, డిసెంబ‌ర్‌లో ఒక‌సారి నిర్వహించాల‌ని... మ‌ళ్లీ ఏప్రిల్‌లో రెండో ద‌శ బోర్డ్ ప‌రీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ సీరియ‌స్‌గా క‌స‌ర‌త్తు చేస్తోంది. అయితే ఇది ఎంత వ‌ర‌కు సాధ్యపడుతుంద‌న్న దానిపై రాష్ట్ర విద్యాశాఖ అధికారుల్లోనే విభిన్న వాద‌న‌లు నెల‌కొన్నాయి. సాధ్యాసాధ్యాల‌పై చర్చించేందుకు త‌్వరలోనే విద్యాశాఖ స‌మావేశం కానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: