ఓ బాలికకు కంటిలో నుంచి రాళ్లు బయటకు వస్తుండడం అందర్నీ షాక్‌కు గురి చేస్తోంది. సాధార‌ణంగా కంటిలో చిన్న నలుసు పడితేనే మనిషి త‌ట్టుకోలేని పరిస్థితుల్లో.. ఏకంగా అందులో నుంచి చిన్న చిన్న రాళ్లు బయటకు వస్తుండడం విస్మయం కలిగిస్తోంది. అయితే గతంలోనూ కొన్ని చోట్ల ఇలాంటి ఘటనలు బయటికి వచ్చాయి. కానీ ఈ బాలిక కళ్ల నుంచి ఏకంగా రోజుకు 25 నుంచి 30 రాళ్లు వస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయం. వివ‌రాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం మదన్‌పల్లి గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక రాజేశ్వరి  గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్లో ఏడో తరగతి చదువుతోంది. 

 

అయితే గ‌త కొన్ని రోజులుగా రాజేశ్వరి కంటి సమస్కలతో బాధపడుతోంది. ఈ క్ర‌మంలోనే ఎడమ కంట్లో నుంచి ఒకదాని వెంట ఒకటి రాళ్లు బయట పడుతుండడంతో.. బాలిక త‌ల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మూడు రోజుల నుంచి రెప్ప కింది భాగం నుంచి వివిధ సైజుల్లో ఉన్న రాళ్లు పడుతున్నాయని బాలిక తల్లి విజయ తెలిపారు. ఇప్పటికి 25 రాళ్లు గుర్తించినట్టు వెల్లడించారు. అలాగే అవి వచ్చే సమయంలో భరించలేని నొప్పి ఉంటుందని బాలిక విలవిల్లాడుతోంది. 

 

దీంతో వైద్యం కోసం నిజామాబాద్‌లోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించినా ఎవరూ సరైన కారణం చెప్పలేదు. కళ్లలో నుంచి రాళ్లు ఎందుకు వస్తున్నాయనే అంశాన్ని తేల్చలేకపోయారు. ఈ విషయాన్ని వారు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లగా, గతంలో దేశంలో ఇలాంటి రెండు మూడు కేసులు నమోదయ్యాయని చెప్పారు. వాటిపై గతంలోనే పరిశోధనలు జరిపినా, కంట్లో నుంచి రాళ్లు వస్తున్నందుకు గల కచ్చితమైన కారణాలు గుర్తించలేకపోయినట్లు వెల్లడించారు. దీంతో వాళ్ల‌కు ఏం చేయాలో తెలియ‌క ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: