
తాజాగా సోలో బ్రతుకే సో బెటరూ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి ధరమ్ తేజ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అందులో మరీ ముఖ్యంగా దేవా కట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్థానం లాంటి సినిమా చేసి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్న దేవా కట్టా అనంతర కాలంలో ఎందుకోగాని సినిమాలు చేయకుండా సైలెంట్ అయ్యాడు. అలాంటిడి ఆయన ఇప్పుడు రిపబ్లిక్ అనే సినిమా చేస్తుండడంతో ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది. సినిమా టైటిల్ లోనే ఇది ఒక పొలిటికల్ సబ్జెక్ట్ అని జనానికి అర్థం అవుతోంది. అదీకాక ఆ మధ్య విడుదల చేసిన మోషన్ పోస్టర్ ద్వారా ఈ సినిమా ఖచ్చితంగా రాజకీయాలకు సంబంధించింది అనే క్లారిటీ జనానికి వచ్చేసింది.
ఈ సినిమా బ్యాక్ డ్రాప్ అంతా కొల్లేటి సరస్సు నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు లక్ష ఎకరాల్లో వ్యాపించి ఉన్న కొల్లేరు-సరస్సు ఏషియా ఖండంలోని అతిపెద్ద తాజా నీటి సరస్సులో ఒకటి. ఈ సరస్సు అనేక రకాల చేపలకు, ఆ చేపల మీద ఆధారపడి మనుషులకు ఆలవాలం. ఈ సరస్సు మీద ఆధార పడి వేలాదిమంది జీవనం సాగిస్తున్నారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కొల్లేటి చుట్టూ ఎన్నో రాజకీయాలు నడిచాయి.
ఆపరేషన్ కొల్లేరు అంటూ ఆక్రమణలకు గురైన కొల్లేటి సరస్సును మళ్లీ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. దానిని బేస్ చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు అనే వాదన వినిపిస్తోంది. నిజానికి గతంలో కూడా నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన రౌడీ ఫెలో అనే సినిమాలో కొల్లేటి ప్రస్తావన ఉంటుంది. అక్కడ కూడా రాజకీయ నాయకులు కొల్లేటి ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు చూపిస్తారు కానీ ఎక్కడ డీప్ గా పాయింట్ ని టచ్ చేయలేదు. కానీ ఈ సినిమాలో డీప్ గా టచ్ చేస్తారు అనే వాదన వినిపిస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో ?