అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు ఆయన. సాధారణమైన వ్యక్తి తన ప్రతిభ పట్టుదల వలన నేడు అత్యున్నత స్థాయిలో ఉన్నారు. అంతేకాదు గడిచిన జీవితాన్ని ఏమాత్రం మర్చిపోకుండా... అప్పట్లో తనకు అండదండగా నిలిచినా వ్యక్తులను అందర్నీ గుర్తు పెట్టుకొని ఇప్పటికీ వారితో సన్నిహితంగా ఉంటూ తన గొప్పతనాన్ని చాటుకుంటున్నాడు ఆ హీరో. అగ్ర స్థాయిలో ఉన్నప్పటికీ తన చూపు ఎప్పుడూ నేల పైనే ఉంటుంది. ఆయనే మన సూపర్ స్టార్ రజినీకాంత్. గ్లామర్, గాంభీర్యం, మైమరిపించే స్టైల్ ఆయన సొంతం. బస్సు కండక్టర్ గా పనిచేసిన ఆయన నేడు భారత దేశ ప్రజలు గర్వించదగ్గ విలక్షణ నటుడిగా పేరు ప్రఖ్యాతులు పొందారు. పేరుకు తమిళనటుడు అయినా తన యాక్టింగ్ స్టైల్ ఆయన పేరు దేశవిదేశాల్లో సైతం వినిపించేలా చేసింది.

యావత్ భారతదేశంలో రజినీ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వయసు అరవై దాటినా ఇప్పటికీ మోస్ట్ వాంటెడ్ హీరోగా కొనసాగుతున్నారు ఈ స్టైలిష్ సూపర్ స్టార్. సినీ పరిశ్రమలో ఈయన ఒక ప్రభంజనం, ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకునే అయస్కాంతం, బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టగల సునామీ. ఈయన జీవితంలో ఎన్నో పురస్కారాలు, పద్మభూషణ్ తో సహా పలు అవార్డులు అందుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ కు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. తాజాగా కేంద్రం సూపర్ స్టార్ రజినీకాంత్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. దాంతో ఈ వార్త విన్న అభిమానులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

ఈ అద్భుతమైన వార్తను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే మరోవైపు కొందరు రాజకీయ ప్రత్యర్ధులు మాత్రం విమర్శలు విసురుతున్నారు. ఎన్నికల సమయంలో మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును  తన స్నేహితుడికి అంకితం చేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఈ హీరో... తన గతాన్ని ఎప్పుడూ మరచిపోలేదు. అందుకే ఒకప్పుడు తనకు ఎంతో అండగా నిలిచిన తన స్నేహితుడు బస్సు డ్రైవర్ రాజ్ బహదూర్ కు ఈ అవార్డును అంకితం చేశారు. ఈ సందర్భంగా తన స్నేహితులందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. పేదరికంలోనూ నా అన్నయ్య సత్యనారాయణ రావు గైక్వాడ్ అండదండలు.. నా కోసం చాలా త్యాగం చేసిన నా గురువు.. ఈ రజనీకాంత్ ను సృష్టించిన కె. బాలచందర్ ` అని తన గతాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రతిష్టాత్మక 51 వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును నేడు సూపర్ స్టార్ కు  అందించి సత్కరిస్తామని పేర్కొన్నారు. ఇలాంటి అవార్డులు మరెన్నో ఆయనకు అందాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు ఆయన అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: