ఇంటర్నెట్ డెస్క్: ఇండస్ట్రీలో గత కొద్ది కాలంగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నెపోటిజం బాగా వినిపిస్తోంది. బంధుప్రీతి వల్ల తమ కుటుంబంలోని వారినే పైకి తీసుకొస్తున్నారని, మిగతావారికి తొక్కేస్తున్నారని అనేకమంది ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్‌లోనూ ఈ ఆరోపణలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మన ఇండస్ట్రీలో హీరోలను పరిశీలిస్తే.. ఇక్కడ కూడా కొన్ని కుటుంబాల నుంచే అత్యధిక శాతం హీరోలు వచ్చారనే విషయం అర్థమవుతుంది. అయితే సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోల కుమారులు హీరోలు కావడం, హీరోయిన్ల కుమార్తెలు హీరోయిన్లు కావడం కామన్. అయితే వారు ఎంతమేర హిట్ అవుతారనే దానిపైనే వారి సక్సెస్ ఆధారపడి ఉంటుందనే వాదన కూడా ఉంటుంది. ఈ లెక్కలో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన హీరోల కుమారులు, వారి కుటుంబాల సభ్యుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ కొన్ని కుటుంబాల హవా నడవడం సాధారణమే. ఇక మన టాలీవుడ్‌లో కూడా ఈ సంప్రదాయం తరతరాలుగా నడుస్తోంది. ప్రధనంగా మన ఇండస్ట్రీ మొత్తం ఫాదర్స్ అండ్ సన్స్‌తో నిండిపోయింది. అప్పటికే కొన్నేళ్లుగా తండ్రులు హీరోలుగా సినిమాలు చేస్తుంటే.. ఇప్పుడు వారి బాటలో కొడుకులు కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అలానే కజిన్స్ - అల్లుళ్లు హీరోలుగా తెరమీద దర్శనమిస్తున్నారు. అందులో ప్రధానంగా మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీలే ఇండస్ట్రీని ఏలుతున్నాయి. ఈ నాలుగు కాంపౌండ్స్ నుంచే ఎక్కవ మంది హీరోలు మన ఇండస్ట్రీలో ప్రస్తుతం రాణిస్తున్నారు.

ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి.. కొన్ని దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతున్నాడు. చిరు అండతో సన్స్ అండ్ అల్లుళ్లు కలుపుకొని దాదాపు 15 మంది వరకు టాలీవుడ్లో  అదరగొడుతున్నారు. పవన్ కల్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, కల్యాణ్ దేవ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్‌లతో పాటు మెగాస్టార్ చిరంజావి కూడా హీరోగా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. మరో వైపు నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వరుస సినిమాలతో అదరగొడుతుంటే.. తారకరత్న కూడా ఇంతకుముందు హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. వీరితో పాటు  బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా డెబ్యూ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

అలాగే అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ తెరపై మెరుస్తున్నారు. ఇక దగ్గుబాటి ఫ్యామిలీలో కొన్నేళ్ల క్రితం వరకు విక్టరీ వెంకటేష్ ఒక్కడే హీరోగా ఉండగా.. లీడర్‌ సినిమాతో దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు రానా కూడా హీరోగా అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. అంతేకాదు త్వరలోనే చినబాబు దగ్గుబాటి అభిరామ్ కూడా ఎంట్రీ కూడా ఉండబోతోంది. 


ఇక ఘట్టమనేని కుటుంబంలో మహేష్ బాబు హీరోగా రాణిస్తుంటే.. బావ సుధీర్ బాబు కూడా హీరో అయ్యాడు. సినీ బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్లో అడుగుపెట్టిన వారు అడపాదడపా తళుక్కుమంటున్నారు. అలాగే కృష్ణం రాజు కుటుంబం నుంచి ప్రభాస్ ఇప్పటికే ఆల్ ఇండియా హీరోగా అదరగొడుతున్నాడు.

 రవితేజ, నాని, విజయ్ దేవరకొండ వంటి వారు సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కూడా బాలీవుడ్‌లానే నెపోవుడ్‌గా మారిపోతోందని, దీనిపై కూడా అంతా దృష్టిసారించాల్సి ఉందని అంటున్నారు. మరి దీనిపై ఆయా హీరోల ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: