స్టార్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి మరోసారి తన గొప్ప మనసు చాటుకుంది. విద్యార్థుల ఫీజుల కోసం తాను పాటలు పాడి వీడియోలు పంపుతానని, డబ్బులు సాయం చేయమని కోరింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తాను ముగ్గురు స్టూడెంట్స్‌ని చదివించే బాధ్యత తీసుకున్నానని, ఆ ముగ్గురిలో ఒకరు మెడికల్ స్టూడెంట్ కూడా ఉన్నాడరని, అయితే ప్రస్తుతం ఆఫర్స్ లేని కారణంగా వాళ్ళ ఫీజులు చెల్లించడం కష్టంగా మారిందని చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరైనా తమకు ఇష్టమైన సాంగ్ చెబితే దానిని పాడుతూ వీడియో రికార్డు చేసి పంపుతానని, అలాగే బర్త్ డే విషెస్ కూడా తెలియజేస్తానని, అందుకుగానూ కొంత డబ్బులు ఇవ్వమంటూ అభ్యర్థించింది.

మీటూ ఉద్యమం నేపథ్యంలో గీత రచయిత వైరముత్తుపై చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు ఇండస్ట్రీలో ఆఫర్లు తక్కువైపోయాయి. అలాగే సౌత్ ఇండియన్ డబ్బింగ్ కళాకారుల యూనియన్ అధ్యక్షుడు రాధారవిపై కూడా అలాంటి ఆరోపణలే చేసింది. దీంతో ఆమెను డబ్బింగ్ కళాకారుల యూనియన్ నుంచి తొలగించారు. దీనిపై ఆమె కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. కానీ ఆమెకు ఆఫర్లు మాత్రం రావడం లేదు. దీంతో ఆమె కెరీర్ కోల్పోయింది. ఆదాయం కరువైంది.

కాగా.. చిన్మయి తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో పాటలు పాడింది. కొందరు హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు చిన్మయి మంచి స్నేహితురాలు. సమంతకు అనేక సినిమాల్లో చిన్మయి డబ్బింగ్ చెప్పింది. అలాగే మరికొంత మంది హీరోయిన్లకు కూడా చిన్మయి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేసింది. అయితే ఇప్పుడు తెలుగులో కూడా ఆమెకు ఆఫర్లు కరువయ్యాయి. దీంతో ఆఫర్లు లేక ఆర్థికంగా ఆమె ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలోనే ఇలా సోషల్ మీడియాలో ఆమె ఓ సందేశం ఉంచారు. మరి దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: