మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అద్భుతంగా రాస్తాడు అనే విషయం తెలిసిందే. అయితే త్రివిక్రమ్ అసలు పేరు చాలా మందికి తెలియదు. త్రివిక్రమ్ అసలు పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస్. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 1971 నవంబర్ 7న జన్మించాడు. త్రివిక్రమ్ తల్లిదండ్రులు భాస్కరరావు, నరసమ్మ. అయితే భీమవరంలో డిఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన త్రివిక్రమ్ సాహిత్యం పై ప్రేమతో సినిమా రంగంలోకి వచ్చాడు. ఇక్కడ మొదట రచయిత, నటుడు అయిన పోసాని కృష్ణ మురళి వద్ద సహాయకుడుగా పనిచేశాడు. ఇక 1999లో వచ్చిన స్వయంవరం సినిమా ద్వారా మాటల రచయితగా సినిమా రంగంలోకి ప్రవేశించాడు త్రివిక్రమ్. ఆ తర్వాత చాలా సినిమాలకు మాటలు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా మారి భారీ విజయాలను అందుకున్నాడు. అయితే డైరెక్టర్ గా మారిన తర్వాత కమర్షియల్ ఫార్ములాస్ ను బాగా అలవర్చుకున్నాడు త్రివిక్రమ్.

నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు తో తీసిన అతడు సినిమాతో దర్శకునిగా తానేంటో నిరూపించుకోవడం మాత్రమే కాకుండా ఓ బెంచ్ మార్క్ ను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది.. ఎన్టీఆర్ తో  అరవింద సమేత వంటి భారీ విజయాలను సొంతం చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గతేడాది అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో అనే సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాకుండా రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ ను సాధించాడు. అయితే ఇప్పటి వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో రెండు సినిమాలు తీయగా.. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తో మూడు సినిమాలు తెరకెక్కించాడు. అలాగే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడు త్రివిక్రమ్. ఇక పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న భీమ్లా నాయ‌క్‌ సినిమాకు మాటలు అందిస్తున్నాడు ఈ మాటల మాంత్రికుడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: