తెలుగులో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఓ వాల్యూ, క్రేజ్ తీసుకొచ్చిన హీరోయిన్ అంటే ఠక్కున మెదిలే పేరు విజయశాంతిదే. ఆమె చేసిన పాత్రలు, చాలెంజింగ్ రోల్స్ తెలుగులో మరే హీరోయిన్ కూడా చేసుండదు. నెంబర్ వన్ హీరోయిన్ గా విజయశాంతి పేరు మోగిపోవడానికి ఇదొక కారణం. ఆ తర్వాత రమ్యకృష్ణ, సౌందర్య నెంబర్ వన్ ప్లేస్ పొందినా విజయశాంతిలా కాలేదు. కానీ.. విజయశాంతి తర్వాత అంతటి పేరు సంపాదించిన హీరోయిన్ అంటే మాత్రం ఖచ్చితంగా అనుష్క అను చెప్పాలి.

 

 

ఎనభైల్లో స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా చేస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం విజయశాంతికే చెల్లింది. ప్రతిఘటన, రేపటిపౌరులు, కర్తవ్యం.. వంటి సినిమాలు చేసింది. అనుష్క కూడా మెయిన్ హీరోయిన్ గా స్టార్ హీరోల పక్కన సినిమాలు చేస్తూనే అరుంధతి చేసింది. అరుంధతి సినిమా అనుష్క కెరీర్ ను ఒక్కసారిగా మార్చేసింది. అరుంధతి పాత్ర కోసమే అనుష్కనా.. అనుష్క కోసమే అరుంధతి కథ పుట్టిందా అన్నట్టు మారిపోయింది పరిస్థితి. అటుపై హీరోయిన్ గానే చేస్తూ పంచాక్షరి, రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి.. సినిమాలు చేసింది. సైరా.. లో ఝాన్సీ దేవిగా చేసిన ఓ చిన్న పాత్రలో మెరుపులు మెరిపించింది. పెద్ద హీరోలతో పెద్దగా హిట్లు లేకపోయినా స్టార్ హీరోయిన్ గా మాత్రం అనుష్క రాణించింది.

 

 

అరుంధతి సినిమా ఆమె కెరీర్లో ఓ మణిహారం అనే చెప్పాలి. తర్వాత బాహుబలి సిరీస్ లో చేసిన దేవసేన పాత్ర అనుష్కకు జాతీయస్థాయి కీర్తిని తెచ్చిపెట్టింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు అప్పట్లో కేరాఫ్ అడ్రస్ గా విజయశాంతి ఉన్నట్టు.. ఈ జనరేషన్ లో అనుష్క అంతటి పేరు సంపాదించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం నిశ్శబ్దం సినిమా ద్వారా మరో మంచి క్యారెక్టర్లో ప్రేక్షకులను పలకరించబోతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: