తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ నిరంకుశ పాలన కొనసాగుతుందని..అభివృద్ది పేరు చెబుతూ..ప్రజలను మోసం చేస్తున్నారని..సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేద‌ని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మండిప‌డ్డారు. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. కానీ ఆయ‌న ఇంటికే నాలుగు ఉద్యోగాలొచ్చాయ‌ని ఎద్దేవా చేశారు. ఐదో ఉద్యోగం కోసం మ‌రొక‌రు కూడా రెడీగా ఉన్నార‌ని అన్నారు. చేవెళ్ల‌లో బ‌స్సు యాత్ర‌కు శ్రీకారం చుట్టిన టి. కాంగ్ నేత‌లు .. గ‌తంలో వైఎస్ చేవెళ్ల నుంచే పాద‌యాత్ర మొద‌లు పెట్టార‌ని గుర్తు చేశారు.  బ‌స్సు యాత్ర ప్రారంభానికి ముందు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ద‌ర్గాలో ప్ర‌త్యేక ప్రార్ధనలు చేశారు. 

చేవేళ్ల‌లో కాంగ్రెస్ బ‌స్సుయాత్ర ప్రారంభించిన ఆయ‌న‌.. అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడారు. అధికారంలోకి వ‌స్తే ద‌ళితుల‌కు మూడెక‌రాలు భూమి ఇస్తామ‌న్న కేసీఆర్ .. ఒక్క శాతం భూమి కూడా ఇవ్వ‌లేద‌ని అన్నారు. ఇదే టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి చివ‌రి బ‌డ్జెట్ అని, ఈ బ‌డ్జెట్ లోనే అర్హులైన ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

కేసీఆర్‌కు అహంకారం పెరిగిందని, ఆయనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవాలని తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు చెప్పారు. త్వరలోనే తాము తెలంగాణలో బస్సు యాత్ర నిర్వహిస్తున్నామని, కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు.బీసీల ప‌ట్ల కేసీఆర్ క‌ప‌ట ప్రేమ చూపిస్తున్నార‌న్న ఉత్త‌మ్ .. ఆయ‌న‌కు బుద్ధి చెప్పే స‌మ‌యం వ‌చ్చింద‌ని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: