ప్ర‌భుత్వ ఉద్యోగుల మ‌న‌సు గెలుచుకునే ప‌థ‌కాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కీల‌క‌మైన అంశంపై స‌మీక్ష నిర్వ‌హించిన సంద‌ర్భంగా....ఆయ‌న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల‌ను ఖుష్ చేసే ప్ర‌క‌ట‌న చేశారు. గ్రామపంచాయతీల్లో పనిచేసే సిబ్బంది కోసం పూర్తి ప్రభుత్వ ఖర్చుతో ఎస్కే డే జీవితబీమా పథకాన్ని అమలుచేయనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రగతిభవన్‌లో మంత్రులు, కలెక్టర్లు, డీపీవోలు, డీఎల్పీవోలు, ముఖ్య కార్యదర్శుల సమావేశం జరిగింది. దాదాపు పదిగంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ...పంచాయతీ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.2 లక్షల బీమా సొమ్ము అందేలా పథకం ఉంటుందని వివరించారు.


త‌న ఆలోచ‌న గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్ల‌డిస్తూ...రైతులకోసం అమలుచేస్తున్న రైతుబీమా మాదిరిగానే.. దేశంలో పంచాయతీరాజ్ ఉద్యమానికి ఆద్యుడైన ఎస్కే డే కు నివాళిగా ఈ జీవితబీమాకు ఆయన పేరు పెడుతున్నట్లు చెప్పారు. గ్రామాల్లో పచ్చదనం- పరిశుభ్రత పెంచడం లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ (పల్లె ప్రగతి) దిగ్విజయంగా అమలైందని తెలిపారు. పల్లె ప్రగతిని విజయవంతం చేసిన మంత్రులు, కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవో), డివిజన్ లెవల్ పంచాయతీరాజ్ అధికారులు (డీఎల్పీవో), మండల పంచాయతీ అధికారులు (ఎంపీవో), గ్రామ కార్యదర్శులు, సర్పంచులకు సీఎం అభినందనలు తెలిపారు. అన్ని గ్రామాల్లో పవర్‌వీక్ నిర్వహించి, విద్యుత్ సంబంధిత సమస్యలు పరిష్కరించడంలో విద్యుత్‌శాఖ అద్భుతంగా పనిచేసి, అన్ని శాఖల్లోకెల్లా నంబర్‌వన్‌గా నిలిచిందని చెప్పారు.30 రోజుల పల్లె ప్రణాళిక కార్యాచరణలో గుర్తించిన పనుల నిర్వహణకోసం జిల్లాలకు రూ.64 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.


గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల పెంపకం తదితర పనుల నిర్వహణలో అత్యవసరమైనచోట ఖర్చు పెట్టడానికి వీలుగా ప్రతి జిల్లా కలెక్టర్ కు రూ.2 కోట్ల ప్రత్యేక నిధులు ఉంటాయని, వీటిని కలెక్టర్లు తమ విచక్షణతో వినియోగించాలని సీఎం చెప్పారు. ఈ మేరకు 32 జిల్లాలకు (హైదరాబాద్ జిల్లా మినహా) రాష్ట్ర ప్రత్యేక నిధుల నుంచి రూ.64 కోట్లు విడుదలచేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: