నిర్భయ దోషులు మరోసారి న్యాయస్థానం తలుపుతట్టారు. మరో రెండు రోజుల్లో ఉరిశిక్షకు అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్న వేళ ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలంటూ కోర్టు మెట్లెక్కారు. ఇప్పటికే అన్ని న్యాయావకాశాలను వినియోగించుకున్న దోషులు మరోసారి ఉరి అమలు వాయిదా కోసం కోర్టు మెట్లెక్కడం గమనార్హం. తాము దాఖలు చేసిన అభ్యర్థనలు, పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని అందువల్ల ఉరిపై స్టే విధించాలని నిర్భయ దోషులు కోరారు. 
 
రెండోసారి క్షమాభిక్ష కోరే అవకాశాలను పరిశీలించాల్సి ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. దోషులు వేసిన పిటిషన్ రేపు విచారణకు రానుంది. ప్రభుత్వ న్యాయవాదికి, తీహార్ జైలు అధికారులకు కోర్టు పిటిషన్ ను రేపు విచారించనున్నట్లు నోటీసులు జారీ చేసింది. దోషులు వరుసగా పిటిషన్లు దాఖలు చేస్తూ దేశ ప్రజల సహనాన్ని పరిశీలిస్తున్నారు. ఉరి అమలు వాయిదా వేయడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 
 
ఇప్పటికే వీరికి మూడు సార్లు ఉరి అమలు వాయిదా పడగా రేపు దోషులు దాఖలు చేసిన పిటిషన్ విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. తాజాగా నిందితులు పిటిషన్ దాఖలు చేయడంతో శుక్రవారం వీరిని ఉరి తీస్తారా...? లేదా...? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు డెత్ వారంట్ ప్రకారం మార్చి 20 ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాల్సి ఉంది. 
 
ఇప్పటికే తలారి తీహార్ జైలుకు చేరుకున్నాడు. ఢిల్లీలో 2012, డిసెంబర్ 16వ తేదీన కదులుతున్న బస్సులో ఆరుగురు యువకులు నిర్భయపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల జైలు శిక్ష అనంతరం విడుదలయ్యాడు. రేపు నిర్భయ దోషుల్లో ఒకరైన అక్షయ్ భార్య విడాకులు కావాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ కుడా ఔరంగాబాద్ ఫ్యామిలీ కోర్టులో విచారణకు రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: