ఎగువ నుంచి వస్తున్న వరదకు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు తోడయ్యాయి. దీంతో తెలంగాణలోని పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో సైతం పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీనికి ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద తోడయ్యింది. దీంతో ఆదిలాబాద్ జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలు  నిలిచిపోయాయి. భైంసా గడ్డెన్న వాగుకు వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో ప్రాజెక్టు  గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.        

గడ్డెన్న వాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తినప్పుడు కొట్టుకుపోయిన యువకుడి మృతదేహం లభ్యమైంది. భైంసా పట్టణానికి చెందిన యోగేష్‌... కూలీపని కోసం బ్రిడ్జిపై నుంచి వెళ్తుండగా ప్రమాదవశాత్తు వరదనీటిలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ఎన్.ఆర్ గార్డెన్ దగ్గర గల వాగులో యోగేశ్‌ మృతదేహం లభ్యమైంది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరద ముంచెత్తున్నాయి. మంజీరాలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ఇసుక కోసం వెళ్లిన ట్రాక్టర్ డ్రైవర్లు అక్కడే ఇరుక్కుపోయారు. సమాచారం తెలుసుకున్న అధికారులు  వాళ్లను కాపాడారు.

భారీ వర్షాలతో హైదరాబాద్ శివారు ప్రాంతాలు వణికి పోతున్నాయి. గడిచిన వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో హయత్‌నగర్‌లోని సుమారు 156 కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఎగువన ఉన్న చెరువులు కుంటలు పొంగిపొర్లడంతో.. దిగువన కాలనీలకు వరద పోటెత్తుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు వారం రోజులుగా నీళ్లలో నానుతున్నాయి.

మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు. మొత్తానికి తెలుగు రాష్ట్రాలు వర్షం పేరెత్తగానే చిగురుటాకులా వణికిపోతున్నాయి. వరుసగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక్కడ కురుస్తున్న వర్షాలకు తోడు.. ఎగువ నుంచి వస్తున్న వరదలతో ప్రాజెక్టులు నిండు కుండలా తొణికిసలాడుతున్నాయి. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: