ఇటీవలే కరోనా వైరస్ బారినపడ్డ డొనాల్డ్ ట్రంప్.. నాలుగు రోజుల కిందటే ఆస్పత్రి నుంచి వైట్‌హౌస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్‌నకు కోవిడ్ సోకడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేశారు. అయితే ఆయన ప్రస్తుతం కోలుకున్నారని, శనివారం నుంచి బహిరంగ కార్యక్రమాలలో పాల్గొంటారని వైట్‌హౌస్ ప్రధాన వైద్యుడు సీన్ కాన్లే గురువారం వెల్లడించారు. అధ్యక్షుడికి వైరస్ నిర్ధారణ అయి శనివారం నాటికి 10 రోజులు పూర్తవుతుందని, వైద్య బృందం నిర్వహిస్తున్న అధునాతన విశ్లేషణల ఆధారంగా అప్పటి నుంచి బహిరంగ కార్యక్రమాలలో అధ్యక్షుడు తిరిగి పాల్గొనడం సురక్షితమేనని కాన్లే ఓ ప్రకటనలో అన్నారు. మొత్తంమీద అధ్యక్షుడు చికిత్సకు బాగా సహకరించారని, వైరస్ ఆయనపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపలేదని పేర్కొన్నారు.


ట్రంప్‌కు కోవిడ్-19 నిర్ధారణ కావడంతో చికిత్స కోసం గత శుక్రవారం వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. ట్రంప్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యులు సిఫార్సు మేరకు ఆయన ఆస్పత్రిలో చేరారు. మూడు రోజులపాటు ఆయనకు జ్వరం రాకపోవడం, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు సాధారణ స్థితికి చేరడంతో సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ సోకిన తర్వాత ట్రంప్‌నకు చికిత్సలో ప్రయోగాత్మక యాంటీ వైరల్ ఔషధాలు రెమిడిసివిర్, స్టెరాయిడ్ డెక్సామెథాసోన్ వినియోగించారు.
అయితే, ట్రంప్ ఊపిరితిత్తులపై వైరస్ ప్రభావం చూపిందా? లేదా? చివరిసారిగా నిర్వహించిన కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల్లో అధ్యక్షుడికి నెగెటివ్ వచ్చిందా? అనే అంశాలను వెల్లడించడానికి వైద్యులు నిరాకరించారు. ట్రంప్‌నకు ఆస్పత్రిలో ఉన్నప్పుడు రెండుసార్లు ఆక్సిజన్ అందజేసినట్టు తెలిపారు. ఇక, ట్రంప్ కోవిడ్ బారినపడ్డ తర్వాత వైట్‌హౌస్ కరోనాకు హాట్‌స్పాట్‌గా మారిపోయింది.


‘కోవిడ్-19కు భయపడవద్దు.. మీ జీవితం ఆధిపత్యం చెలాయించే అవకాశం ఇవ్వొద్దు.. ట్రంప్ పాలనలో అనేక మంచి ఔషధాలు అభివృద్ధి, విజ్ఞానం సాధించాం... 20 ఏళ్ల కిందట కంటే తాను ప్రస్తుతం చాలా బాగున్నా’ అని ట్రంప్ పేర్కొన్నారు. నవంబరు 3న అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా.. కేవలం మరో 25 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పాల్గొనడం అనివార్యమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: