ఈ భూప్రపంచం మీద జరిగే కొన్ని సంఘటనలు, అద్భుతాలు ఎవరికీ అంతు చిక్కవు. ఇప్పుడు కూడా అలాంటి విచిత్రమైన సంఘటన గురించే ప్రపంచ దేశాలలో ఆసక్తికరమైన ర్చ జరుగుతోంది. నిర్మానుష్య ప్రదేశాల్లో ప్రత్యక్షమై.. ఆ తర్వాత కొద్ది రోజులకే అదృశ్యమవుతూ పరిశోధకులకు అంతుబట్టని ఏకశిల ఇపుడు భారత్‌ లోనూ దర్శనమిచ్చింది. అహ్మదాబాద్‌ తాళ్‌తేజ్ ప్రాంతంలోని సింఫనీ పార్క్‌లో ఆరడుగుల పొడవున్న లోహంతో కూడిన ఏకశిల ప్రత్యక్షమైంది. ఇది భూమిలో పాతిపెట్టినట్టు ఉన్నా, ఎక్కడా మట్టిని తవ్విన ఆనవాళ్లు లేవు. ఈ ఘటనపై సింఫనీ పార్క్ తోటమాలి ఆశారామ్‌ మాట్లాడుతూ.. ఆ ఏకశిల అక్కడికి ఎలా వచ్చిందో అర్థం కావడంలేదని విస్మయం వ్యక్తం చేశారు. ముందురోజు సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో చూసినపుడు అసలు దాని ఆనవాళ్లే లేవని, ఉదయం వచ్చి చూసేసరికి ప్రత్యక్షమైందని వివరించాడు.



ఆ శిలపై ఏవో కొన్ని అంకెలు, త్రికోణాకార గుర్తులు ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 30 నగరాల్లో ఇదే తరహా ఏకశిలలు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఇవి అంతుచిక్కని రహస్యంగానే ఉన్నాయి. ఈ వింత శిల గురించి తెలియడంతో జనాలు అక్కడకు చేరుకుని ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ ఏకశిల తొలిసారి అమెరికాలో ప్రత్యక్షమయ్యింది. తర్వాత కొద్ది రోజులకు మాయమయ్యింది. తర్వాత రొమేనియా, ఫ్రాన్స్, పోలెండ్, యూకే, కొలంబియాలోనూ ఇటువంటి ఏకశిల దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని సింఫనీ పార్క్‌‌ను ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. మున్సిపల్ కార్పొరేషన్‌కు కానీ, ప్రయివేట్ సంస్థకు కానీ ఈ నిర్మాణం మూలాలు గురించి ఇంత వరకు తెలియదు. కానీ, మున్సిపల్ కార్పొరేషన్ హార్టికల్చర్ విభాగం డైరెక్టర్ జిగ్నేశ్ పటేల్ మాట్లాడుతూ.. ఈ ఏకశిలాను పార్కును సందర్శించే వ్యక్తుల కోసం సింఫనీ లిమిటెడ్ ఏర్పాటు చేసిందన్నారు. ప్రజలు దాని మెరిసే ఉపరితలం ప్రతిబింబాన్ని చూడవచ్చు.. దానితో సెల్ఫీ తీసుకోవచ్చు అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: