పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం...తెలుగుదేశం పార్టీ కంచుకోట. టీడీపీ ఆవిర్భావం నుంచి జరిగిన ఎన్నికల్లో అత్యధిక సార్లు పసుపు జెండా ఎగిరింది. 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా కొవ్వూరులో టీడీపీ గెలిచింది. అయితే 2004 ఎన్నికల్లో వైఎస్సార్ హవాలో కాంగ్రెస్ స్వల్ప మెజారిటీతో విజయం సాధించింది. ఇక 2009, 2014 ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ సత్తా చాటింది. అంటే ఏడు సార్లు కొవ్వూరులో టీడీపీ గెలిచింది.


2019 ఎన్నికలోచ్చేసరికి జగన్ వేవ్‌లో టీడీపీ ఓటమి పాలైంది. అయితే ఓడిపోయాక కొవ్వూరులో టీడీపీ ఏమన్నా పుంజుకుందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ రెండేళ్లలో కొవ్వూరులో టీడీపీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది. దాంతో నియోజకవర్గంలో టీడీపీ అడ్రెస్ గల్లంతై పరిస్తితి వచ్చింది. 2014లో కొవ్వూరు నుంచి గెలిచిన కే‌ఎస్ జవహర్ వల్ల నియోజకవర్గంలో గ్రూపులు వచ్చాయి.


జవహర్ మంత్రి అయ్యాక పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. దీంతో జవహర్ వ్యతిరేక వర్గం తయారైంది. అలాగే ఆయనకు మళ్ళీ సీటు రాకుండా చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు జవహర్‌ని కృష్ణా జిల్లాలోని తిరువూరులో నిలబెట్టారు. అలాగే విశాఖపట్నం పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన వంగలపూడి అనితని కొవ్వూరులో నిలబెట్టారు. జగన్ వేవ్‌లో ఇద్దరు ఘోరంగా ఓడిపోయారు.


ఇక తర్వాత అనితని మళ్ళీ పాయకరావుపేటకు పంపించేశారు. కానీ కొవ్వూరుకు మాత్రం నాయకుడుని పెట్టలేదు. ఇదే సమయంలో జవహర్‌ని రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడుగా నియమించారు. కొవ్వూరు, రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. దీంతో జవహర్ మళ్ళీ కొవ్వూరులో రాజకీయాలు మొదలుపెట్టారు.


అటు జవహర్ వ్యతిరేక వర్గం సైతం పోటీగా రాజకీయాలు చేస్తుంది. ఇలా పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరగడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడింది. అలాగే నెక్స్ట్ ఎన్నికల్లో సైతం ఈ కంచుకోటలో టీడీపీకి గెలుపు దక్కేలా కనిపించడం లేదు. మరి చూడాలి చంద్రబాబు కొవ్వూరులో నాయకత్వాన్ని మార్చి పార్టీని నిలబెడతారో లేక జవహర్‌కు అప్పగించి లైన్‌లో పెడతారో?

మరింత సమాచారం తెలుసుకోండి: