ఎవర్ గివెన్‌ నౌక.. మూడు నెలల క్రితం ఈ నౌక ఓ పెద్ద వార్తగా మారింది. సూయజ్‌ కాలువకు అడ్డంగా చిక్కుకుని వేల కోట్ల నష్టం కలిగించింది. ఆ తర్వాత దాన్ని మార్గం నుంచి తొలగించినా..ఇంకా ఆ నౌక అక్కడే ఉండిపోయింది. నష్టపరిహారం చిక్కులే ఇందుకు కారణం.. ఇప్పుడు ఆ చిక్కులన్నీ తొలగిపోయి మొత్తానికి ఎవర్‌గివెన్‌ నౌక విడుదలకు రూట్ క్లియర్ అయ్యింది. నష్టపరిహారం ఇవ్వనిదే నౌకను కదలనివ్వబోమని సూయజ్ కెనాల్ అథారిటీ స్పష్టం చేసినందున మార్చి నెల నుంచి ఈ నౌక అక్కడే ఉండిపోయింది.


ఈ ఏడాది మార్చిలో సూయజ్ కాలువలో ఈ ఎవర్ గివెన్ అడ్డంగా చిక్కుకుపోయింది. ఆ మార్గంలో కొన్ని రోజుల పాటు జల రవాణా పూర్తిగా ఆగిపోయింది. మొత్తానికి ఓ వారం పాటు నౌక అక్కడే ఉండిపోయింది. మొత్తానికి వారం తర్వాత నౌకను కాలువకు అడ్డు తప్పించారు. అయినా అక్కడి నుంచి వెళ్లిపోవడానికి అనుమతి రాలేదు. ఈ నౌక సూయజ్ కాలువలో ఆగిపోవడం వల్ల ఆ మార్గంలో జల రవాణాకు ఆటంకం కలిగి భారీ ఆర్థిక నష్టం కలిగింది.


ఆ నష్టపరిహారం చెల్లిస్తేనే నౌకను అక్కడి నుంచి కదలనిస్తామని సూయజ్ కెనాల్ అథారిటీ భీష్మించుకుంది. అంతే కాదు.. నష్టానికి పరిహారం చెల్లించాలంటూ సూయజ్ కెనాల్ అథారిటీ ఈజిప్ట్ కోర్టులో కేసు వేసింది. మొత్తం 91.6 కోట్ల అమెరికన్ డాలర్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఆ తర్వాత  కొన్ని చర్చల తర్వాత ఆ మొత్తాన్ని 55 కోట్ల డాలర్లకు తగ్గించింది. లెక్క కుదిరినా ఈ మొత్తం ఎవరు ఇవ్వాలన్న దానిపై క్లారిటీ రాలేదు. ఈ సొమ్ము  నౌక యాజమాన్య సంస్థ కట్టాలా..  బీమా కంపెనీ కట్టాలా అన్నది తేలలేదు.


మళ్లీ ఈ అంశంపై ఎవర్‌గివెన్ నౌక యజమాని జపాన్‌కు చెందిన షోయీ కిసెన్, బీమా కంపెనీలు కోర్టుకెక్కాయి. చివరకు  మూడు నెలల తర్వాత ఎట్టకేలకు నౌక యాజమాన్య సంస్థ, బీమా కంపెనీల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఫైనల్‌గా ఎవర్‌గివెన్ నౌక సూయజ్ కాలువ నుంచి కదలడానికి కెనాల్ అథారిటీ నుంచి అనుమతి లభించింది. విచిత్రం ఏంటంటే.. ఎవర్‌గివెన్‌ నౌక అడ్డంకులు సృష్టించినా సూయజ్‌ కెనాల్‌ అథారటికీ ఈ ఏడాది తొలి 6 నెలల్లో 3 బిలియన్‌ డాలర్ల ఆదాయం వచ్చిందట.


మరింత సమాచారం తెలుసుకోండి: