మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ మరింత వేగవంతమైంది. హత్య కేసులో అరెస్టైన  సునీల్ కుమార్ యాదవ్ ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా సీబీఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం పులివెందులలోని రోటరీపురం వాగులో నిన్నటి నుంచి గాలిస్తూనే ఉన్నారు. నిన్న సాయంత్రం వరకు సాగిన గాలింపు... తిరిగి ఈ రోజు ఉదయం నుంచి మరోసారి కొనసాగించారు. ఆయుధాల కోసం శోధించిన అధికారులు... వాగులో ఎడమ వైపు అన్వేషించడం ముగించారు. వాగులు మురికి నీరు ఉండడంతో.... రెండు ట్యాంకర్లు, 20 మంది మునిసిపల్ సిబ్బంది సాయంతో మురికినీటిని తొలగించారు. యంత్రాలతో నీటిని తొలగించి.. గాలించినా... ఆయుధాల జాడ మాత్రం దొరకలేదు. రోటరీపురం వాగును సర్వే చేస్తున్నారు. రేపు కూడా మరోసారి సర్వే సిబ్బంది వాగును అన్వేషించనున్నారు.

మరోవైపు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుతో సంబంధం ఉన్న పలువురిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో... వివేకా కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు సీబీఐ అధికారులను కలిశారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు వెళ్లిన సునీతా రెడ్డి దంపతులు... సీబీఐ అధికారులతో సమావేశమయ్యారు. కేసుకు సంబంధించిన విషయాలపై సీబీఐ అధికారులతో చర్చించారు. హత్య కేసు విచారణలో భాగంగా ఈ రోజు పలువురిని విచారించారు అధికారులు. ఉదయ్ కుమార్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి, ఇనయతుల్లా, రంగన్న, వంట మనిషి లక్ష్మమ్మ కుమారుడు ప్రకాశ్ లను అధికారులు విచారించారు. ఇప్పటికే సునీల్ యాదవ్ ను కస్టడీకి తీసుకుని విచారిస్తున్న అధికారులు... కడప కేంద్ర కారాగారంలోనే తమ విచారణను కొనసాగిస్తున్నారు. మరోవైపు కేసు విచారణలో జాప్యం జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు నిందితులు తప్పించుకునే అవకాశం ఉందని కూడా ఆరోపిస్తున్నారు. కేసు విచారణను త్వరగా ముగించాలని డిమాండ్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: