పెద్దపల్లి జిల్లాలో రియల్ దందా జోరుగా సాగుతోంది. నిబంధనలు గాలికొదిలి.. వ్యవసాయ భూములను వెంచర్లుగా మార్చి విక్రయిస్తున్నారు. అక్రమ వెంచర్లపై చర్యలకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. దీంతో పెద్దపల్లి పట్టణం చుట్టూ ఉన్న వ్యవసాయ భూముల్లో పుట్టగొడుగుల్లా అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. జిల్లా కేంద్రంగా పెద్దపల్లి మారడంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా పుంజుకుంది. ప్రస్తుతం పెద్దపల్లి పట్టణ పరిసరాల్లోని వ్యవసాయ భూముల్లో భారీగా వెంచర్లు వెలుస్తున్నాయి. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న నిమ్మంపల్లి, అప్పన్నపేట, హనుమంతుని పేట, చికురాయి, పెద్దబొంకూరు గ్రామాల్లో రియల్టర్లు భారీగా భూములను కొనుగోలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో గడిచిన రెండేళ్లల్లో 18 అక్రమ వెంచర్లు వెలిసినట్లు అధికారులు గుర్తించారు. తూతూ మంత్రంగా ఒకటి, రెండింటిపై మాత్రమే చర్యలు తీసుకుని చేతులు దులుపుకున్నారు. ఇక మిగతా వాటి జోలికి వెళ్లడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వ్యవసాయ భూముల్లో వెంచర్లు వేయాలంటే.. ముందు వ్యవసాయేతరంగా మార్చుకోవాలి. ఆ తర్వాత మున్సిపల్‌ లేదా పంచాయతీ చట్టాలకు అనుగుణంగా వెంచర్లు ఏర్పాటు చేయాలి. ముందుగా 10 శాతం స్థలాన్ని స్థానిక సంస్థలైన పంచాయతీకి లేదా మున్సిపాలిటీకి కేటాయించాలి. వాటి పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలి. అలా చేయకపోతే వెంచర్‌కు భారీగా జరిమానా విధించాలని నిబంధనలు చెబుతున్నాయి. ప్రస్తుతం పెద్దపల్లి పట్టణ సమీపంలో ఉన్న భూములపై రియల్ వ్యాపారులు కన్నేశారు. రైతులకు డబ్బు ఎరవేసి.. వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తున్నారు. అనుమతులు లేకుండానే ప్లాట్లు వేస్తున్నారు. కొన్న ధరకు మూడింతల రేటు పెంచి.. ప్లాట్లను విక్రయిస్తున్నారు. అక్రమ వెంచర్లపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నా.. రియల్టర్లు పట్టించుకోవడం లేదు.

పెద్దపల్లి పట్టణంలో భారీగా వెలసిన వెంచర్లలో కొన్నింటికి మాత్రమే అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. ఇక అనధికారికంగా ఏర్పాటు చేసిన 18 లేఔట్లను అధికారులు గుర్తించారు. వాటిపై చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఓ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే వారు కార్యాలయం దాటి బయటకు రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సామాన్యులు మోసపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: