తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందర రాజన్‌ తన మార్క్‌ను చూపించడానికి సిద్ధం అవుతున్నారా? గవర్నర్‌ అంటే రబ్బరు స్టాంపు కాదని, ప్రజా సమస్యలు వినేందుకు తాను కూడా సిద్ధమని ప్రజలకు భరోసా కల్పించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజ్‌భవన్‌ వర్గాలు. త్వరలో రాజ్‌భవన్‌లో ప్రజా దర్బార్‌ ప్రోగ్రామ్‌ని నిర్వహించేందుకు గవర్నర్‌ తమిళ సై సౌందర రాజన్‌ సిద్ధమవుతున్నారని సమాచారం. ఇక నుంచి గవర్నర్‌ హోదాలో ఆమె స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. అందుకు అవసరమైన కార్యాచరణను మరో పక్షం రోజుల్లోగా రెడీ చేసేందుకు రాజ్‌భవన్‌ వర్గాలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలో ఏ గవర్నర్‌ చేయని విధంగా తమిళసై సౌందర రాజన్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రజా దర్బార్‌ వేదిక దోహదం చేస్తుందని భావిస్తున్నారు.

తెలంగాణ రెండవ గవర్నర్‌గా, తొలి మహిళా గవర్నర్‌గా తమిళసై సౌందర రాజన్‌ 2019 సెప్టెంబర్‌ 8న బాధ్యతలు చేపట్టారు. గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్న మొదట్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వం మీద తనదైన రీతిలో విమర్శలు చేసారు. ఇక కరోనా తీవ్రతను ప్రభుత్వం చాలా తక్కువగా అంచనా వేసిందని నేరుగా సీఎంను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా తీవ్రతను నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కే తెలియజేశాననీ, పరీక్షల సంఖ్య పెంచాలని కోరినా స్పందించలేదనీ ఆమె ఓ దశలో అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ చేసిన వ్యాఖ్యలతో అప్పట్లో అధికార పార్టీ నేతలు ఇరకాటంలో పడ్డారు.

గతంలో గవర్నర్‌ నరసింహన్ పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారనే విమర్శలు ఉన్నా... తమిళ సై వచ్చాక రాష్ట్ర బీజేపీ , కాంగ్రెస్ నేతలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా దూర దృష్టిలో భాగంగానే తమిళ సైకి గవర్నర్ బాధ్యతలు అప్పగించారు అనే చర్చ కూడా నడిచింది. ఈ నేపథ్యంలో ఆమె గవర్నర్ హోదాలో స్వయంగా ప్రజా దర్బార్‌ నిర్వహిస్తే ఎలాంటి పరిస్థితులు, పరిణామాలు సంభవిస్తాయో అనే చర్చ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: