వైసీపీలో సీనియర్ మంత్రులు కొందరు ఉన్నారు. వారిలో ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన బొత్స సత్యనారాయణ మార్క్ వేరుగా ఉంటుంది. ఆయన రాజకీయం మూడు దశాబ్దాలను దాటేసింది. బొత్స రాజకీయ వ్యూహాలు చతురత ఆయన అంగబలం, అర్ధబలం అన్నీ కూడా ఉత్తరాంధ్రాలో ఆయన్ని తిరుగులేని నాయకుడిగా చేశాయి.

బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాపై తన పట్టు మరింతగా బిగించేశారు. ఆయన 2019 ఎన్నికల వేళ జగన్ ఇమేజ్ కి తోడు తన సొంత బలం, చాకచక్యాన్ని కూడా ఉపయోగించి మొత్తానికి మొత్తం సీట్లు వైసీపీకి దక్కేలా చేశారు. దాంతో తొమ్మిది అసెంబ్లీ, ఒక ఎంపీ సీటు వైసీపీ పరం అయ్యాయి. కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు, ఆయన కుమార్తె కూడా ఓటమి పాలు అయ్యారు.

ఇక అదే మ్యాజిక్ ఈ ఏడాది వరసగా జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లోనూ కనిపించడం విశేషం. విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున పంచాయతీలు వైసీపీ గెలుచుకుంది, ఇక అన్ని మునిసిపాలిటీలు వైసీపీ పరం అయ్యాయి. విజయనగరం కార్పోరేషన్ కూడా  ఆ పార్టీకే దక్కింది. ఇపుడు పరిషత్ ఎన్నికల్లో చూసుకుంటే భారీ విజయం దక్కింది. మొత్తం జెడ్పీటీసీలు వైసీపీ ఈ జిల్లాలో గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసి పారేసింది. ఇక కొత్త జెడ్పీ చైర్మన్ గా బొత్స బంధువు మజ్జి శ్రీనివాసరావు అవబోతున్నారు.

మొత్తానికి విజయనగరం జిల్లాలో తన పట్టును కొనసాగిస్తూ బొత్స నాటౌట్ అంటున్నారు. ఆయన దూకుడుని విపక్షాలు తట్టుకోలేక చతికిలపడ్డాయి. ఇక అధికార వైసీపీలో కూడా తన మార్క్ ని బొత్స చూపుతున్నారు. ఆయన్ని మంత్రి వర్గ విస్తరణలో తొలగించడం కష్టమే అంటున్నారు. సీనియర్ మంత్రి, జగన్ కి అతి సన్నిహితుడు, కీలకమైన మూడు రాజధానుల వ్యవహారానికి సంబంధించిన  శాఖను చూస్తున్న బొత్సను కదపడం అసంభవం అన్న మాట అయితే ఉంది. మొత్తానికి అయిదేళ్ళ మంత్రిగా బొత్స జగన్ క్యాబినేట్ లో రికార్డ్ క్రియేట్ చేస్తారు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: