అదే ప‌నిగా వాహ‌నాలు హార‌న్ కొడితే ఎంత చీద‌రింపుగా ఉంటుంది. మ‌రీ ముఖ్యంగా ట్రాఫిక్‌లో ఉంటే ఇక అంతే సంగ‌తులు చెవులు గిల్లుమ‌న‌క త‌ప్ప‌దు.. అటు వాహ‌నాల నుంచి వ‌చ్చే పొల్యూష‌న‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మీది నుంచి ఈ వాహ‌నాల హార‌న్ బొబ్బ వ‌ర్ణ‌ణాతీతం. రోడ్డు మీద ప్ర‌యాణించే వాళ్లే కాదు.  రోడ్డుకు ప‌క్క‌న ఇండ్ల‌లో ఉన్న వారికి కూడా ఈ ఇబ్బంది త‌ప్ప‌దు. ధ్వ‌ని కాలుష్యంతో పాటు ఇబ్బందులు కూడా ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. అయితే, వాహ‌నాల నుంచి హార‌న్ సౌండ్ కాకుండా సంగీతం వ‌స్తే ఎలా ఉంటుంది.. ఒక సారి ఊహించండి రోడ్డు మీద వెళ్లేట‌ప్పుడు వాహ‌నాల నుంచి హార‌న్‌గా మంచి సంగీతం వినిపిస్తే ఎలా ఉంటుంది.. భ‌లేగా ఉంటుంది క‌దూ..


అవును.. తొంద‌ర‌లోనే హార‌న్ లొల్లి త‌ప్పి వాహ‌నాల నుంచి సంగీతం రూపంలో హార‌న్ రానుంది. వాహ‌నాల హారన్ల శబ్దానికి సంబంధించి కొత్త నిబంధనలను అమలు చేయడానికి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది కేంద్ర ప్రభుత్వం.  ఇక రోడ్లపై హారన్ సౌండ్ కి బదులు మంచి మంచి భార‌తీయ వాయిద్యాల శ‌బ్దాలు రానున్నాయ‌ట‌. నాసిక్ లో జరిగిన హైవే ప్రారంభోత్స‌వ‌ కార్యక్రమంలో  కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ధ్వని కాలుష్యం గురించి మాట్లాడుతూ.. హారన్‌ల సౌండ్‌ను మార్చబోతున్నట్లు చెప్పారు.


హారన్లకు బదులు ప్రశాంతమైన సంగీత వింటారన్నారని చెప్పారు మంత్రి.  వాహనాల హారన్ల బాధాకరమైన శబ్దం గురించి.. తన మంత్రిత్వ శాఖ అధికారులు కార్ హారన్ల శబ్దాన్ని మార్చే పనిలో ఉన్నట్లుగా తెలిపారు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రి. భారతీయ సంగీత సాధనాలైన పిల్లన గ్రోవి తబలా హార్మోనియం లాంటి వాటిని మాత్రమే వాహనాలకు హార‌న్‌గా అమర్చేలా చట్టం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్న‌ట్టు చెప్పారు. పోలీసు, అంబులెన్స్ వాహనాల సైరన్ సౌండ్‌ కూడా మార్చాలని చూస్తున్న‌ట్టు వివ‌రించారు. మంత్రులు, ఉన్న‌తాధికారులు రోడ్లపై వెళ్తున్నప్పుడు పోలీసు వాహనాలు పెద్ద ఎత్తున సైరన్ సౌండ్‌ చేస్తూ వెళ్తాయ‌ని.. ఇది చాలా చిరాకు కలిగిస్తుంది అని చెప్పారు.


ఈ సౌండ్ చెవులకు కూడా మంచిది కాద‌ని, అందుకోస‌మే ఆకాశవాణిలో ఉదయం పూట వచ్చే సంగీతాన్ని సైరన్ శబ్ధంగా మార్చాలని భావిస్తున్న‌ట్టు తెలిపారు. ఇది మనసుకు ఆహ్లాదాన్ని క‌లిగిస్తుంది అని పేర్కొన్నారు. గడ్కరీ తన అనుభవాన్ని వివరిస్తూ.. తాను నాగపూర్లోని 11 వ అంతస్తులో నివసిస్తున్నట్లు చెప్పిన ఆయన..రోజూ ఉదయం ఓ గంట పాటు ప్రాణాయామం చేస్తానని ఆ సమయంలో రోడ్డుపై వాహనాల హారన్ల శబ్ధాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయన్నారు. కార్ హారన్ శబ్దం ఇండియన్ మ్యూజిక్ లా ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందన్నారు. భారీ వాహనాలకు భారీ శబ్ధం వస్తుంటుంది. వాహనం తయారవుతున్నప్పుడే హార్న్ సెట్ చేస్తారు కాబట్టి..కొత్త నిబంధనల అమలు తర్వాత వాహనాల హారన్ లకు బదులు తబలా వయోలిన్ బుగ్లే వేణు ట్యూన్స్ వినవచ్చన్నారు. నితిన్ గడ్కరీ కామెంట్స్ విన్న నెటిజన్లు మంచి ఆలోచనే కదా..మార్పు మంచిదే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: