తెలంగాణాలో ఉపఎన్నికలు సెగలు రేపుతున్నాయి. నేటితో ప్రచారం ముగుస్తుండటంతో సభలు, సమావేశాలు, ర్యాలీలతో.. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు హోరెత్తిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల ప్రచారానికి రెండు పార్టీలకు చెందిన అగ్ర నేతలు హాజరు కాలేదు. బీజేపీ అగ్రనేతలందరూ పూర్తిగా ప్రచారానికి మొహం చాటేశారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల పట్ల ప్రజల్లో వ్యతిరేకత కారణంగా వారెవరూ ప్రచారానికి రాలేదు. దీంతో ఈటెల రాజేందర్ ఒక్కడే ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. సీఎం కేసీఆర్ అహంకార ధోరణిని సరైన గుణపాఠం చెప్పాలంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు.

బీజేపీ ప్రచారం సంగతి పక్కనబెడితే.. సీఎం కేసీఆర్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదు. హుజూరాబాద్ లో ప్రచారానికి అవకాశం ఉన్నప్పటికీ, ఆయన మాత్రం రాలేదని తెలుస్తోంది. అయితే కేసీఆర్ ఎందుకు రాలేదనే విషయంపై ఆసక్తికర సమాచారం అందుతోంది. తన పార్టీ నుంచి బయటకు వెళ్లి, బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ పేరెత్తడం కూడా కేసీఆర్ కు ఇష్టం లేదట.. అందుకే తాను ప్రచారానికి రానని తేల్చిచెప్పినట్టు సమాచారం.. ఎన్నికల ప్రచారానికి నేటితో గడువు పూర్తవుతుండటంతో ఈరోజైనా..  కేసీఆర్ బహిరంగ సభ పెడతారని అందరూ భావించారు. అయితే కేసీఆర్ కు మాత్రం ఈటెల పట్ల ఉన్న ఈ అభిప్రాయం కారణంగా ప్రచారానికి రాలేదని తెలుస్తోంది. మరోవైపు నెపం మాత్రం ఈసీపై నెట్టేశారు. వెయ్యి మందితో సీఎం సభ అసాధ్యం కాబట్టి.. సీఎం సభ పెడితే ప్రజలు వెల్లువలా వస్తారు కాబట్టి.. హుజూరాబాద్ లో సభ క్యాన్సిల్ చేశామంటున్నారు. పక్క జిల్లాలో పెట్టాలనుకున్నా, ఎన్నికల నిబంధనలు అడ్డుగా ఉన్నాయి కాబట్టి సభ పెట్టలేదంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు.

హుజూరాబాద్ ఎన్నికల ప్రచారానికి తాను హాజరు కాకపోయినా.. ప్రచారం మాత్రం హోరెత్తించాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.. మరింత ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్లాలని కార్యకర్తలను కోరారు. ప్రతీ ఓటరును కలవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణాలో టీఆర్ఎస్ చేసిన సంక్షేమ పధకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున అనుసరించాల్సిన వ్యూహాలను పార్టీ నేతలకు సూచించారు. పార్టీ నేతలతో టెలీ కాన్ఫెరెన్స్ నిర్వహించి వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించి తీసుకురావాలని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: