కారు జోరుకు బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఉపఎన్నికల రూపంలో గులాబీ పార్టీకి ఊహించని ట్విస్ట్ లు ఎదురవుతున్నాయి. ఏదో ఒక కారణంతో ఉపఎన్నిక అనివార్యమవుతూ వస్తోంది. 2018ఎన్నికల తర్వాత 3నియోజక వర్గాలకు ఉపఎన్నికలు వచ్చాయి.

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రంగారెడ్డి కన్నుమూయడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ బైఎలక్షన్ పై సర్వత్రా చర్చ జరిగింది. సోలిపేట రంగారెడ్డి సతీమణి సుజాతను టీఆర్ఎస్ పార్టీ బరిలోకి దింపింది. బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు పోటీలో నిలబడ్డారు. దుబ్బాకలో ఎలాగైనా మళ్లీ విజయం సాధిస్తామని అధికార పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. చివరకు దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలవడంతో అసంతృప్తికి గురైంది. ఆ తర్వాత నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ కు బీజేపీ పోటీ ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పోటీ నడిచింది. అక్కడ జానారెడ్డిపై టీఆర్ఎస్ గెలిచింది. మళ్లీ ఇప్పుడు హుజూరాబాద్ లో బీజేపీ నుంచి పోటీ చేసిన ఈటల గెలిచారు. దీంతో అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల బలం మూడుకు పెరిగింది.

ఇక 2014కు ముందు జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ తన జోరు కొనసాగించింది. కేసీఆర్ కూడా ఉపఎన్నికల బరిలో నిలబడి విజయం సాధించారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు అలా లేవు. ప్రజలు ఏవైపు మొగ్గు చూపుతారో ఎవరూ పసిగట్టలేకపోతున్నారు. దీంతో రాజకీయ పరిణామాలు ఏ వైపు దారితీస్తాయో ఎవరికీ అర్థం కావడం లేదు. రాజకీయ విశ్లేషకుల అంచనాలు సైతం తలకిందులవుతున్నాయి. అందుకు నిదర్శనమే దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలు. దుబ్బాకలో సింపతీ పనిచేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అది పనిచేయలేదు. ఇక హుజూరాబాద్ లో హరీష్ రావు అన్నీ తానై వ్యవహరించారు. ప్రచారంలో ఎన్నో వాగ్దానాలిచ్చారు. బీజేపీని ఓడించేందుకు గ్యాస్, పెట్రోల్ ధరల పెంపు అంశాన్ని తీసుకొచ్చారు. కానీ ప్రజలు ఎందుకో ఈటల వైపే మొగ్గు చూపారు.  






మరింత సమాచారం తెలుసుకోండి: