ఎగవరేగడి పల్లె...  ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కరబలకోట మండలం లోని ఓ చిన్నగ్రామం. ఆ పల్లె ఎక్కడుంది?  ఎలా ఉంది ? అని కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దృష్టి సారించారు. ఇక మీడియా ప్రతినిధులు సరేసరి. వీరినే కాదు దాదాపుగా యావత్ భారతావనిని ఆకర్షించిన ఆ పల్లె ఇప్పడు కన్నీరు పెడుతోంది... ఎందుకో తెలుసా ?
తమిళనాడు లోని నీలగిరి కనుమల్లో హెలికాఫ్టర్ ప్రమాదంలో సిడిఎస్ అధినేత బిపిన్ రావత్ సహా మృతి  చెందిన వారిలో ఎగువ రేగడి పల్లెకు చెందిన  సాయితేజ ఒకరు. దీంతో యావత్ భారతావని ఈ గ్రామం పై దృష్టి పెట్టింది. సైనిక సిబ్బంది తెలిపిన వివరాల మేరకు... ఇతను మిలటరీ బాస్ కు వ్యక్తిగత సహాయకుడు కూడా. 2012 లో సైన్యంలో సిపాయిగా చేరారు. బెంగుళూరు రెజిమెంట్ నుంచి ఎన్నికయినా  చాలా చోట్ల పనిచేశారు. ముఖ్యంగా ఎముకలుకొరికే చలిలో జమ్మూ- కాశ్మీర్ లో విధులు నిర్వర్తించారు. ఆ తరువాత డిపార్ట్ మెంట్ టెస్ట్ లాంటి పరీక్షలు రాసి తన సత్తా ఏమిటో  సైనికాధికారులకు ప్రదర్శించి, అందరి మెప్పును పొందారు. సైన్యంలో ఎప్పుడు కూడా మెరుపుదాడులుచేసేవారికి ప్రత్యేక స్థానం ఉంటుంది. వారిని పారా కమాండోలు అని వ్యవహరిస్తారు. అలాంటి పారా కమాండో స్థాయికి  సాయి తేజ ఎదిగారు. అంతేకాకుండా గగన మార్గంలో నేరుగా శత్రవులు ఉండే చోటికి ధైర్యంగా వెళ్లి వారిని మట్టుబెట్టగల సమర్థతను నిరూపించుకున్నారు. పారా కమాండోగా ఎన్నికయిన తరువాత కూడా వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేక శిక్షణ పొందారు. అంతే కాదు అతను పొందిన శిక్షణ బృందంలో ప్రథముడుగా నిలిచారు. వివిధ అధికారిక పర్యటనలలో సాయితేజ పనితీరును గుర్తించిన బిపిన్ రావత్ , ఇతర సైనికాధికారులు  అతనిని సిడిఎస్ కు  వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా చేర్చారు.  దేశ సేవ చేయడంలో ఎక్కువ  తృప్తిని పొందే సాయితేజ తన సోదరుడ్ని కూడా సైన్యంలో చేర్పించారు. అతను ప్రస్తుతం సిక్కింలో విధులు నిర్వర్తిస్తున్నాడు. శలవుల్లో ఇంటికి వచ్చినప్పడు తన చిన్న నాటి మిత్రులతో కలసి కలివిడిగా తిరిగే వాడని సాయి తేజ బాల్యమిత్రుడు గోవర్దన్ మీడియాకు తెలిపారు. గ్రామంలో అందరికీ సైన్యం లో జరిగే సంఘటనలు, తాను, తన సహచర బృందం చేసిన సాహసాలను అందరితో ను పంచుకునే వాడు. యుక్తవయస్కులందరినీ సైన్యంలో చేరాలని ప్రోత్సహించేవారని  ఎగువ రేగడి పల్ల వాస్తవ్యులు పాత్రికేయలకు తెలిపారు. సాదారణంగా ఇంట్లో ఎవరైనా చనిపోతే మృతుని కుటుంబ సభ్యులు శోక సంద్రంలో ఉంటారు.  కాకపోతే ఆ వీధివాళ్లు బాధాతప్త హృదయంతో ఉంటారు. సాయితేజ మరణం ఏకంగా ఓ పల్లె నే ఏడిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: