గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీని మరింత బలోపేతం చేయడం కోసం వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత వసంత కృష్ణ ప్రసాద్. నియోజకవర్గంలోని కొండపల్లి మునిసిపాలిటిలో ఎదురుదెబ్బ తగలడంతో... పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు గుర్తింపు ఇచ్చేలా వసంత అడుగులు వేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఎప్పుడెప్పుడా అని నేతలు ఎదురు చూసిన పదవుల హడావుడి... పండుగ పూర్తి కావడంతో మొదలైంది. పార్టీ కోసం ఆదినుండి పని చేసిన వారికి కులాల ప్రాతిపదికన ఎంపికలు జరుగుతాయని ఇప్పటికే వసంత ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీలకు పార్టీ పదవులు దక్కుతాయని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నారు. మైలవరం వైసీపీ లో కొత్త జోష్ మొదలైనట్లు కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ మరింత బలోపేతం చేయడానికి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.. పార్టీ పదవుల నియామకాలపై ఎమ్మెల్యే వసంత దృష్టి సారించినట్లు సమాచారం. ఇటీవల కాలంలో మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న గ్రామ, పట్టణ కమిటీలను రద్దు చేసిన పార్టీ అధిష్టానం... పండగ తరువాత కొత్త కొలువులు ఉంటాయని సంకేతాలు ఇచ్చింది.

సంక్రాంతి పండగ హడావిడి ముగియడంతో పార్టీ పదవుల నియామకాలపై కసరత్తు మొదలు పెట్టినట్టు ప్రచారం జోరుగా జరుగుతోంది. పార్టీ పదవుల కొలువుల ప్రచారం తెరమీదకు రావడంతో ఏ గ్రామంలో ఎవరికి పదవులు వరిస్తాయి అన్న విషయంపై ఊహాగానాలు మొదలైపోయాయి. మైలవరం నియోజకవర్గ పదవుల ఎంపిక ఒక ఎత్తు అయితే కొండపల్లి మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం మండల పదవుల ఎంపిక విషయంపై మాత్రం తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంగా ఉండే ఇబ్రహీంపట్నం మండల కన్వీనర్, కొండపల్లి మునిసిపాలిటి పరిధిలోని అధ్యక్ష పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉంది. వీటి కోసం ఇప్పటికే జగన్ స్థాయిలో కూడా పైరవీలు చేసేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. మైలవరం నియోజకవర్గంలో అత్యంత కీలకపాత్ర పోషించే మండలం ఇబ్రహీంపట్నం. ఈ నేపథ్యంలో పార్టీ కన్వీనర్ ఎంపిక కత్తి మీద సామే అని చెప్పాలి. పార్టీ ప్రారంభం నుంచి వైసీపీలో ఉంటూ... అన్ని కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్న నేతల పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన వ్యక్తులకే పదవులు కేటాయించాలని కూడా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: