కోవిడ్ మ‌హమ్మారి వివిధ వేరియంట్ల రూపంలో మ‌రోసారి ప్ర‌పంచ‌దేశాల‌న్నింటినీ వ‌ణికిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే త్వ‌ర‌లోనే ఇది ఎండెమిక్ ద‌శ‌కు చేరుకోవ‌చ్చ‌ని ఒక‌ప‌క్క కొంద‌రు నిపుణులు చెపుతుండ‌గా మ‌రోప‌క్క ల‌క్ష‌ల సంఖ్య‌లో కొత్త‌గా ఒమిక్రాన్ కేసులు ప‌లు యూరోపియ‌న్ దేశాలు, ద‌క్షిణ అమెరికా దేశ‌మైన బ్రెజిల్‌లోనూ రోజూ న‌మోద‌వుతున్నాయి. జ‌ర్మ‌నీలో కేసుల సంఖ్య ల‌క్ష దాటగా, ఫ్రాన్స్‌లో ఈ సంఖ్య‌ ఏకంగా 5 ల‌క్ష‌లకు చేరుకోవ‌డం క‌ల‌వ‌రం క‌లిగిస్తోంది. మొత్తంగా యూరోపియ‌న్ దేశాల‌న్నిటా క‌లిపి గ‌త‌వారం 50 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు రావ‌డంతో వ‌చ్చే రెండు నెల‌ల్లో మొత్తం యూరోప్‌లో స‌గం మంది ఈ వైర‌స్ బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. ఇక బ్రెజిల్‌లోనూ 1.4 ల‌క్ష‌ల కేసులు న‌మోదు కావ‌డంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఎందుకంటే అభివృద్ది చెందుతున్న దేశంగా ఉన్న బ్రెజిల్ అధిక జ‌నాభాతో పాటు, జ‌న‌సాంద్ర‌త కూడా క‌లిగిన దేశం కావ‌డంతో క‌రోనా రెండోవేవ్ అక్క‌డ పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌ల ప్రాణాల‌ను హ‌రించింది.

ఇక వైర‌స్ పుట్టుక‌కు కార‌ణ‌మ‌ని భావిస్తున్న చైనా కోవిడ్ మూడోవేవ్ ని నియంత్రించేందుకు క‌ఠిన‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. వైర‌స్ సోకిన‌వారిని ప్ర‌త్యేక‌మైన గ‌దుల్లో ఉంచి చికిత్స అందిస్తున్న ఆదేశం హాంకాంగ్‌లో వైర‌స్ జాడ‌లు క‌నిపించాయ‌న్న అనుమానంతో హ్యామ్‌స్ట‌ర్స్ అనే ఎలుక జాతికి చెందిన పెంపుడు  జంతువులను పెద్ద సంఖ్య‌లో వ‌ధించాల‌ని నిర్ణ‌యించింది. ఇదిలా ఉండ‌గా కోవిడ్-19 వైర‌స్ బారిన ప‌డ్డ‌వారు పది రోజులు ఐసోలేష‌న్ ఉన్నాకూడా వారిలో క్రియాశీల‌కంగానే ఉంటుంద‌ని, ఆ త‌ర్వాత కూడా వారినుంచి అది ఇత‌రుల‌కు వ్యాపించే అవ‌కాశం ఉంటుంద‌ని బ్రిటిష్ శాస్త్ర‌వేత్త‌ల తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డి కావ‌డం కూడా ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఎక్సెట‌ర్ యూనివ‌ర్శిటీకి చెందిన సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో భాగంగా వైర‌స్ బాధితుల న‌మూనాల‌ను ప‌రిశీలించ‌గా వారిలో ప‌లువురికి 10 రోజులు త‌రువాత కూడా వైర‌స్ జాడ‌లు క‌నిపించ‌గా, కొంత‌మందికి 68 రోజుల త‌రువాత కూడా వైర‌స్ క్రియాశీల‌కంగా ఉన్న‌ట్టు తేలింది. భార‌త్‌లో కోవిడ్ తీవ్ర‌త కొన‌సాగుతుండగా పెద్ద సంఖ్య‌లో వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు కూడా దీని బారిన ప‌డుతున్నారు. ముస్సోరీలోని ట్రైనీ ఐఏఎస్‌ల్లో ప‌లువురికి పాజిటివ్‌గా తేలిన‌ట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: