
మొదటి భయం ఆయన ముందున్నది పీఆర్సీ ..
ఇప్పటికీ ఆయన 11వ పీఆర్సీ పై ఉన్న ప్రతిష్టంభనను తొలగించలేకపోతున్నారు.ఫిట్మెంట్ 23 శాతానికి మించి ఇవ్వలేననే చెప్పారు.అయితే ఉద్యోగులు మాత్రం మళ్లీ ఉద్యమాలపై మనసు పారేసుకుంటున్నారు.తాము చెప్పిన విధంగా చీకటి జీఓల ఉపసంహరణ కాకుండానే చర్చలకు ఎందుకు వెళ్లారని నిలదీస్తున్నారు.అద్దె భత్యాల చెల్లింపుల్లో కూడా చేసిన సవరణలను ఉద్యోగులు అంగీకరించేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు.సచివాలయ ఉద్యోగుల వరకూ హెచ్ ఆర్ 24 శాతం చెల్లింపునకు ఓకే అని చెప్పడం ఒకటి చర్చలలో కాస్త ఊరట.ఇక ప్రతిఐదేళ్లకూ పీఆర్సీ అంటున్నారు కనుక వచ్చే ఏడాదే మళ్లీ కొత్త పీఆర్సీ వేయాల్సి ఉంటుంది.ఎందుకంటే 11 వ పీఆర్సీ గడువు వచ్చే ఏడాది మే తో ముగిసి పోతుంది కనుక. ఇవాళే ఉద్యోగ సంఘాల నేతలు చెప్పిన విధంగా మరో పీఆర్సీకి జగన్ సిద్ధమవ్వడం తథ్యం..ఇదే ఇప్పుడు ఆయనను వెన్నాడుతున్న ఫోబియా.
రెండో భయం సీపీఎస్
కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దుకు సంబంధించి నాటి పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు.ఇదే విషయం చర్చల్లో కూడా ప్రస్తావనకు వచ్చింది.ఈ సందర్భంగా టైం బౌండ్ ఒకటి నిర్ణయించి మరీ! ఈ ఏడాది మార్చి నాటికి ఏదోఒకటి చేసి రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని భావిస్తున్నామని ప్రభుత్వ పెద్ద సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.కానీ ఇది చెప్పినంత సులువు కాదు.అసలు సీపీఎస్ పై టక్కర్ కమిటీ చెప్పిన మాటలు లేదా చేసిన సిఫారసులే ప్రభుత్వం పాటించేందుకు ఏ పాటి సిద్ధంగానూ లేదు.రెగ్యులర్ పెన్షనర్ కు దక్కిన విధంగా సీపీఎస్ లో ఉంటూ రిటైర్ అయ్యే ఉద్యోగికి అవే ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించడం అన్నది జరగని పని.కానీ గతంలో జగన్ ఇలాంటి మాటొకటి చెప్పారు.ఇక టక్కర్ ఏం చెప్పారంటే రెగ్యులర్ పెన్షన్ స్కీంలో రిటైర్ అయ్యే ఉద్యోగులకు,సీపీఎస్ లో ఉన్న ఉద్యోగులకు మధ్య ఉన్న ఆర్థిక వ్యత్యాసాల సవరణ కోసం ఐదు వందల కోట్ల తో కూడిన ఓ మూలనిధి ఏర్పాటు చేస్తే సమస్య కొంతలో కొంత పరిష్కృతం అవుతుందని అన్నారు.అప్పట్లోఇవన్నీ చంద్రబాబు హయాంలో విన్న మాటలు.వీటిలో కొన్ని మారి ఉండవచ్చు కూడా! ఇక రానున్న కాలంలో సీపీఎస్ రద్దు జగన్ ఏమీ మాట్లాడకపోతే సంబంధిత ఉద్యోగులు అస్సలు ఒప్పుకునేలా లేరు.కనుక ఇప్పుడు జగన్ ను వెన్నాడుతున్న రెండో భయమే సీపీఎస్.
మూడో భయం పెద్దిరెడ్డి
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అనే బలమైన ఆర్థిక మూలాలున్నరాజకీయ శక్తే జగనన్న ప్రధాన భయం.ఇంకా చెప్పాలంటే అసలు భయం ఇదే! అందుకే ఆయన పెద్దిరెడ్డి జోలికి వెళ్లరు.ఆయన కొడుకు మిథున్ రెడ్డికి కూడా పెద్దగా ఏమీ చెప్పాలనుకోరు.పార్లమెంట్ లో ఫ్లోర్ లీడర్ గా ఉన్న మిథున్ కి ఎప్పుడో తప్ప ఏ ఇన్ స్ట్రక్షన్స్ ఇవ్వరు గాక ఇవ్వరు.ఆయనకే కాదు పెద్దిరెడ్డితో కూడా పెద్దగా విభేదం కోరుకోరు.ఇంకా చెప్పాలంటే క్యాబినెట్ ను ఇవాళ శాసిస్తుంది పెద్దిరెడ్డి కానీ సజ్జల రామకృష్ణా రెడ్డి కానే కాదు.కానీ మీడియా పుణ్యమాని సజ్జల బయటకు వస్తున్నారు.కొన్ని సందర్భాల్లో బొత్స సైతం పెద్దిరెడ్డి పై అసహనం వ్యక్తం చేసిన దాఖలాలు అనేకం ఉన్నాయి.కనుక జగన్ కన్నాఆర్థిక మూలాలు బలంగా ఉన్న పెద్దిరెడ్డి ని జగన్ ఢీ కొనడం సాధ్యం కాని పని. అందుకే ఆయనంటే జగన్ కు భయం.
నాలుగో భయం మోడీ
ప్రధాని మోడీ అంటే జగన్ కు భయం.ఎందుకంటే ఆయన కేసులను తవ్వి తీస్తారు అని! అందుకే ఆయన చెప్పిన విధంగానే ఈయన నడుచుకుంటూ ఉంటారు.కేసుల కారణంగానే అంబానీ మనిషి పరిమళ్ నత్వానికి రాజ్య సభ సీటు కేటాయించారు.ఇప్పుడు తాజాగా అదానీ మనుషులకు జూన్ నెలలో జరగబోయే రాజ్య సభ ఎన్నికల్లో పార్టీ తరఫున టికెట్ ఇవ్వనుండడం ఖాయం కూడా! ఆ విధంగా మోడీ అన్నా,అంబానీ మరియు అదానీలు అన్నా జగన్ కు భయమే! ఏదో బుద్ధి పొరపాటున అప్పుడెప్పుడో అంబానీ పై రాజశేఖర్ రెడ్డి అభిమానులు కొన్ని ఆరోపణలు చేసి ఉన్నా,కాలగతిలో అవన్నీ కొట్టుకుపోయి చివరకు ముఖ్యమంత్రి హోదాలో జగన్ మిగిలారు.కనుక ఇప్పుడు ఆ రోజు చేసిన విధంగా ఏ ఆరోపణ కానీ ఏ అభియోగం కానీ జగన్ చేయరు గాక చేయరు.కేసుల కారణంగానే కాదు ఇంకొన్ని రాజకీయ ప్రయోజనాల కారణంగా కూడా మోడీ అంటే జగన్ కు భయమే!
ఐదో భయం ఈడీ
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఎలానూ జగన్ కు భయమే!ఇప్పటికే ఈడీ కేసులు ఎటూ తేలకుండా ఉన్నాయి.రేపు జగన్ ను దార్లోకి తెచ్చుకోవాలన్నా,ఢిల్లీ పెద్దలు తాము అనుకున్నది సాధించాలన్నా మోడీ దగ్గరున్న ఏకైక అస్త్రం ఈడీనే! కనుక ఈడీ అన్నా ఇంకా ఇతరేతర దర్యాప్తు సంస్థలన్నా జగన్-కు భయమే.వీటితో పాటు ఇంకొన్ని భయాలూ ఆందోళనలూ చెల్లి షర్మిల రూపంలో వెన్నాడుతున్నాయి.అవి కూడా కలుపుకుంటే జగన్ ఇవాళ మనశ్శాంతిగా లేరు అన్నదే సుస్పష్టం.సాధారణంగా భయాలను జయిస్తే విజయాలు వరిస్తాయి అని అంటారు కదా! ఆ విధంగా భయాలు జయించే శక్తి జగన్-కు ఉందో లేదో అన్నది మాత్రం ఇప్పటికిప్పుడు తేల్చడం కష్టం.కాల ప్రవాహ గతిలో జగన్ తనని తాను నిరూపించుకునే క్రమంలో ఏ మేరకు రాణిస్తారో అన్నది పైన చెప్పిన భయాలే నిర్ణయిస్తాయి.ఆయన సమర్థతను మరియు పాలనా దక్షతనూ కూడా!
- రత్నకిశోర్ శంభుమహంతి