ఏపీ మంత్రి పేర్ని నాని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య గతంలో కూడా మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరిగింది. ఆ తర్వాత ఇరు వర్గాలు కాస్త శాంతించాయి. తీరా ఇప్పుడు ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంలో మరోసారి మంత్రి నాని, పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్ కల్యాణ్ ని చూసి ఎవరు భయపడతారు, ఎందుకు భయడతారు అని అన్నారు. అక్కడితో ఆగితే పెద్ద విషయం అయ్యేది కాదు, ఫ్యాన్స్ ఎక్కడ ఏం చేస్తే హర్ట్ అవుతారో సరిగ్గా అదే చేశారు మంత్రి పేర్ని నాని. పవన్ కల్యాణ్ ఏమైనా పెద్ద హీరోనా.. ఆయన కంటే తర్వాత వచ్చినవాళ్లంతా సూపర్ హిట్స్ ఇస్తున్నారంటూ పోలిక తెచ్చారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు.. కి మంచి హిట్లు ఉన్నాయని, పవన్ కల్యాణ్ ఎప్పుడో అత్తారింటికి దారేది అనే హిట్ సినిమా చేశారని, ఆ తర్వాత ఆయనకు హిట్ లేదన్నట్టు మాట్లాడారు. సరిగ్గా ఇక్కడే అభిమానులు ట్రోలింగ్ మొదలు పెట్టారు.

సినిమా టికెట్లకి, పవన్ కి సంబంధం ఏంటి..?
గతంలో ఓ సినిమా ఫంక్షన్లో పవన్ కల్యాణ్ సినిమా టికెట్లు, ఆన్ లైన్ వ్యవహారం గురించి మాట్లాడారు, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి కౌంటర్లు పడ్డాయి. అక్కడితో ఆ వ్యవహరం సద్దుమణిగింది. కానీ ఇప్పుడు మళ్లీ టికెట్ల వ్యవహారంలో చిరంజీవి నేతృత్వంలోని ఓ బృందం సీఎం జగన్ తో భేటీ అయింది. ఇక్కడ పవన్ ని పిలిచారో లేదో తెలియదు కానీ ఆయన రాలేదు, వస్తారని కూడా ఎవరూ ఊహించలేదు. మరి అలాంటప్పుడు పవన్ ప్రస్తావనే లేని సినిమా టికెట్ల వ్యవహారంలో అనవసరంగా ఆయన్ను ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నిస్తున్నారు అభిమానులు.

భీమ్లా నాయక్ రిలీజ్ విషయంలో కూడా ఇప్పుడు అభిమానులు డైలమాలో ఉన్నారు. సినిమా సెన్సార్ కూడా ఆలస్యం అవుతోంది. దీనికి కారణం ఎవరని ఆరా తీస్తున్నారు అభిమానులు. ఏపీలో భీమ్లా నాయక్ సినిమా విడుదల సమయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటాయేమోని అంటున్నారు. గతంలో వకీల్ సాబ్ సమయంలో కూడా బీజేపీ నేతలు సినిమా థియేటర్ల వద్ద హంగామా చేశారు. ప్రభుత్వం పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసిందని అన్నారు. ఇప్పుడు భీమ్లా విషయంలో ఏమంటారో చూడాలి. మొత్తానికి మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై మాత్రం జనసైనికులు మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: