బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద ఇవాళ  జరపతలపెట్టిన ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’’ను నిర్వహించి తీరుతామని ఆ పార్టీ ప్రకటించింది. ఈ దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం అత్యంత హేయమైన చర్య అని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య గొంతు నులిమేసే కుట్రేనన్న బండి సంజయ్.. సీఎం ధర్నా చేస్తే ఒప్పు.. బీజేపీ దీక్ష చేస్తే తప్పా? అని ప్రశ్నించారు. ఇదెక్కడి అన్యాయం... ప్రజాస్వామ్యవాదులారా మౌనం వీడండి.. బీజేపీ ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’ను కొనసాగించి తీరుతాం అని బండి సంజయ్ ప్రకటించారు.


ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు, ఆందోళనలు చేసే వేదిక ఇందిరాపార్క్ ధర్నా చౌక్ అని..  ట్రాఫిక్ జాం, ప్రజలకు ఇబ్బంది పేరుతో ధర్నా చౌక్ వద్ద బీజేపీ చేపట్టబోయే ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడం విస్మయం కలిగిస్తోందని బండి సంజయ్ అన్నారు. ఇందిరాపార్క్ ను ధర్నా చౌక్ గా పునరుద్దరించిన తరువాత టీఆర్ఎస్, కాంగ్రెస్ సహా అనేక రాజకీయ పార్టీలు, సంఘాలు ఆందోళనలు నిర్వహించాయన్న విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు.


సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశాయని.. అప్పుడే లేని ఇబ్బంది బీజేపీ దీక్ష చేపడతానంటేనే వస్తోందా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని గొంతు నులిపేసే కుట్రేనని..  బీజేపీని అణిచివేసే చర్యగా భావిస్తున్నామని..  అసలు  బీజేపీ పేరు వింటేనే ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోందని బండి సంజయ్ మండిపడ్డారు.

ప్రజా సమస్యలపై నిరంతరం గళమెత్తుతున్న బీజేపీను అణిచివేయాలని అడుగడుగునా సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని.. ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా బడ్జెట్ సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం అందులో భాగమేనని బండి సంజయ్ ఆరోపించారు. ధర్నా చౌక్ వద్ద సీఎంసహా టీఆర్ఎస్, కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు అనుమతి ఇచ్చిన పోలీసులు బీజేపీ దీక్షకు అనుమతి ఇవ్వకపోవడం ముమ్మాటికీ పక్షపాత చర్యేనని బండి సంజయ్ తెలిపారు. మరి దీక్ష చేసి తీరతామని బీజేపీ ప్రకటించినందున ఇవాళ ధర్నా చౌక్  వద్ద రచ్చ రచ్చ తప్పదేమో..

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr