
1980లో షెహబాజ్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన మూడు సార్లు పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు. 1988లో తొలిసారి పంజాబ్ అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1997లో తొలిసారి పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యారు. 1999లో షెహబాజ్ అన్న నవాజ్ షరీఫ్ పాక్ ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటి పాక్ సైన్యాధిపతి జనరల్ పర్వేజ్ ముషారఫ్ సైనిక తిరుగుబాటు చేశారు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూలదోసి అధ్యక్షుడు అయ్యారు.
ఆ సమయంలో షెహబాజ్ ఎనిమిదేళ్లపాటు సౌదీ అరేబియాలో తలదాచుకున్నారు. మళ్లీ ఆయన 2007లో పాకిస్తాన్‌కు వచ్చారు. 2008లో రెండోసారి పంజాబ్ సీఎం అయ్యారు. ఆ తర్వాత 2013లోనూ మరోసారి పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే.. తాను తన సోదరుడు నవాజ్ షరీఫ్‌తో సంబంధాలు తెంచుకుంటే ఏకంగా ప్రధానమంత్రి పదవినిస్తానని జనరల్ ముషారఫ్ ఆశ జూపారట.
అయితే.. ఆ ఆఫర్‌ను తాను తిరస్కరించానని షెహబాజ్ చెప్పుకుంటారు. 2017లో పనామా పేపర్ల కేసు కారణంగా ప్రధాని పీఠం నుంచి నవాజ్ షరీఫ్ వైదొలిగారు. అప్పటి నుంచి పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ అధ్యక్షుడిగా షెహబాజ్ ఉంటున్నారు. 2018 ఎన్నికల తర్వాత జాతీయ అసెంబ్లీలో షెహబాజ్ ప్రతిపక్ష నేత అయ్యారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ మైనారిటీ సర్కారుకు వ్యతిరేకంగా విపక్షాలు అన్నీ ఏకం కావడంతో ఇప్పుడు షెహబాజ్‌కు ప్రధాని అవకాశం లభించింది. అయితే.. ఈయన పార్టీకి కేవలం 87 సీట్లే ఉన్నాయి. విపక్షాలు ఐక్యంగా లేకపోతే.. ఈయన కూడా పదవి నుంచి దిగిపోవాల్సి వస్తుంది.