మంత్రి కాకాణి నెల్లూరులో అడుగు పెట్టారు. అయితే ఆయన.. మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సభపై సింపుల్ గా తేల్చేశారు. ఆ సభ పార్టీ బాగుకోసం పెడుతున్నదే కదా అన్నారు కాకాణి. అనవసరంగా ఆ ఇష్యూని పెద్దది చేయొద్దన్నారు. అయితే కాకాణి ర్యాలీతో జిల్లా వైసీపీ అంతా ఒకే చోటకు వచ్చింది, ఒక్క అనిల్ తప్ప. ఒకరకంగా కాకాణి సర్దుకుపోయినట్టే కనిపించినా.. భవిష్యత్తులో ఆయన రాజకీయం వేరేలా ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. జిల్లాలో తనపై ఉన్న అసమ్మతిని క్రమంగా తగ్గించుకోడానికి ఆయన ప్రయత్నాలు చేస్తారని తెలుస్తోంది. ఆ క్రమంలో తనతో కలసి వచ్చేవారందరినీ ఒకచోట చేరుస్తున్నట్టు స్పష్టమవుతోంది.

మంత్రి అంటే పదవి కాదు..బాధ్యత అని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. నేతలు, కార్యకర్తలు, ప్రజల సూచనలతో రాష్ట్రంలో వ్యవసాయ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు కాకాణి. తాను ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు చేపట్టినా.. రాష్ట్ర స్థాయి బాధ్యతల్లో ఉన్నా కూడా అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారాయన. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో కలసి తాను పనిచేశానని, తాను ఈ స్థాయికి రావడానికి ఆనం కుటుంబం ఎంతో దోహదపడిందని అన్నారు.

వ్యవసాయ శాఖ అంటే ఎంతో కీలకం అని చెప్పారు కాకాణి. రాష్ట్రంలో 70 శాతం మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారని నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. మంత్రిగా అవకాశం కల్పించిన జగన్ కి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు కాకాణి. వైఎస్ఆర్, జగన్ హయాంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు కాకాణి.  రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామంటున్న కాకాణి, ప్రతి రైతు పండిస్తున్న ప్రతి గింజను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. రైతు భరోసా కేంద్రాలను గవర్నర్ ప్రశంసించారని గుర్తు చేశారాయన. వాటిలో ఉన్న చిన్నచిన్న లోపాలను సవరిస్తామన్నారు. పవన్ కల్యాణ్‌, చంద్రబాబు.. రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. మొత్తమ్మీద నెల్లూరు మీటింగ్ లో పొలిటికల్ కామెంట్స్ లేకుండా జాగ్రత్తపడ్డారు కాకాణి. తన శాఖకు సంబంధించి ఎక్కువగా ప్రస్తావించిన కాకాణి.. ప్రస్తుతానికి జిల్లా రాజకీయాలకంటే, రాష్ట్ర స్థాయిలో తనపై జగన్ పెట్టిన బాధ్యతపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: