ఎప్పుడెలాంటి వార్త వినాల్సొస్తోందో ? ఎప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఫ్లాష్ అవుతుందో అనే టెన్షన్ బీఆర్ఎస్ పార్టీ కీలకనేతల్లో పెరిగిపోతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బోయినపల్లి అభిషేక్ రావును సీఐడీ అరెస్టు చేసిందగ్గర నుండి బీఆర్ఎస్ కీలకనేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పైగా సీబీఐ విచారణలో అభిషేక్ మూడురోజులు ఉండబోతున్నారు. ఈ మూడు రోజుల్లో అభిషేక్ ఏ విషయాలు చెబుతారో ఎవరికీ తెలీటంలేదు. ఇప్పటికే సీబీఐ ఇద్దరిని అరెస్టుచేసిన విషయం అందరికీ తెలిసిందే. 





అభిషేక్ రావు అరెస్టులో బీఆర్ఎస్ కీలకనేతలు ఎందుకింతగా టెన్షన్ పడుతున్నట్లు ? ఎందుకంటే ఇప్పటికే కొందరు కీలకనేతలతో రావుకు కోట్లరూపాయల లావాదేవీలు జరిగినట్లు సీబీఐ గుర్తించింది. అలాగే బీఆర్ఎస్ లోని కీలకనేతలతో అభిషేక్ కు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయట. ఇది సరిపోదన్నట్లు కేసీయార్ కూతురు, ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత దగ్గర రావు చాలాకాలం పీఏగా పనిచేశారు.





ఈ కారణంగానే లిక్కర్ స్కామ్ విచారిస్తున్న సీబీఐ, ఎన్పోర్స్ మెంటు డైరక్టరేట్ (ఈడీ) అధికారులు కవితపైన బాగా దృష్టిపెట్టారట. ఇదేసమయంలో ప్రతిపక్షాలు ప్రధానంగా బీజేపీ కేసీయార్ కుటుంబంపైనే ఆరోపణలు చేస్తున్నది. దీంతో బీఆర్ఎస్ కీలకవ్యక్తులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎందుకంటే అప్పట్లో కవిత పీఏ హోదాలో, ఇపుడు పారిశ్రామికవేత్త హోదాలో అభిషేక్ రావు ఎవరెవరితో లావాదీవులు పెట్టుకున్నారో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దాంతో చాలామందిలో టెన్షన్ పెరిగిపోతోంది.





సరిగ్గా ఇలాంటి సమయంలో కేసీయార్ జాతీయపార్టీ అని జాతీయ రాజకీయాలంటు నానా హడావుడి చేస్తున్నారు. ఇలాంటపుడే కవిత పేరో లేకపోతే మరో కీలకనేత పేరో గనుక సిబీఐ విచారణలో బయటపడితే పెద్ద సమస్యగా మారిపోతుంది. లిక్కర్ స్కామ్ లో చేతులుమారిన అమౌంట్ ఎంతన్నది అప్రస్తుతం. కానీ దానివల్ల వచ్చే సౌండ్ మాత్రం అదిరిపోతుంది. అందుకనే లిక్కర్ స్కామ్ తాలూకు డెవలప్మెంట్లపై అధికారపార్టీ నేతల్లో మాట్లాడేందుకు ఎవరు ధైర్యం చేయటంలేదు. మరి మూడురోజుల్లో అభిషేక్ రావు ఏమి మాట్లాడుతారనేది మాత్రం చాలా ఆసక్తిగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: