ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ చేతులు కలపగానే తమ్ముళ్ళల్లో టెన్షన్ మొదలైపోయిందా ? పార్టీలో ఇపుడిదే చర్చ పెరిగిపోతోంది. ఇపుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కలిశామని చెబుతున్నా ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుంటారనే చర్చ టీడీపీలో  మొదలైంది. ఈ రెండుపార్టీలు ఎన్నికలకు ముందు పొత్తుపెట్టుకుంటాయని అందరు ఎప్పటినుండో ఊహిస్తున్నదే. కాకపోతే డైరెక్టుగా పొత్తు పేరుతో కలుస్తారనే అందరు అనుకున్నారు.





అలాంటిది ప్రజాస్వామ్య పరిరక్షణ అనేముసుగులో ఇంతతొందరగా ఇద్దరు చేతులు కలుపుతారని ఎవరూ ఊహించలేదు. వీళ్ళిద్దరు కలిస్తే ఏమవుతుందనేది వేరే విషయం. ఇప్పుడు సమస్య ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో రెండుపార్టీల మధ్య పొత్తు ఖాయమనేది దాదాపు తేలిపోయింది. ఈ కారణంగానే తమ్ముళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే కచ్చితంగా ఓ 45 నియోజకవర్గాల్లో తమ్ముళ్ళపై దెబ్బ పడటం ఖాయమని అర్ధమవుతోంది. పొత్తులో 70-100 అసెంబ్లీ సీట్లు అడగాలని జనసేన అనుకుంటోందట.





అయితే అన్ని సీట్లు ఇవ్వటానికి చంద్రబాబు ఒప్పుకోరు. చివరకు ఓ 45 లేదా 40 సీట్ల దగ్గర ఖాయమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే దామాషాలో 4 పార్లమెంటు సీట్లు కూడా ఇచ్చే అవకాశముందట. ఇంతకాలం పార్టీ సమీక్షల్లో చాలామంది తమ్ముళ్ళు జనసేనతో పొత్తువద్దని, ఒంటిరిగా పోటీచేసినా గెలిచే అవకాశాలున్నాయని గట్టిగా చెబుతున్నారు. ఎందుకంటే పొత్తు కారణంగా తమకు పోటీచేసే అవకాశాలు పోతుందనేది తమ్ముళ్ళ ఆలోచన. అయితే పొత్తులేకపోతే ఏమి జరుగుతుందో చంద్రబాబుకు బాగా తెలుసు.





అందుకనే తమ్ముళ్ళు పొత్తువద్దంటున్నా చంద్రబాబు మాత్రం పొత్తుకే మొగ్గుచూపుతున్నారు. ఇపుడు చేతులు కలపటం భవిష్యత్తు పొత్తుల్లో భాగమే. దాంతో జనసేనకు ఇవ్వబోయే సీట్లెన్ని ? ఆ  నియోజకవర్గాలేవి ? అనే విషయమై పార్టీలో చర్చలు ఊపందుకున్నాయి. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు ఇన్చార్జీలను నియమించలేదు. బాహుశా ఇన్చార్జీలను నియమించకుండా వదిలేసిన నియోజకవర్గాలను జనసేనకు కేటాయిస్తారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు ఇచ్చే నియోజకవర్గాలను పవన్ తీసుకుంటారా లేకపోతే కొత్త నియోజకవర్గాలను అడుగుతారా అనే విషయం కూడా పార్టీలో అయోమయం పెంచేస్తోంది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: